
ఓరుగల్లులో ప్రపంచ సుందరీమణుల పర్యటన
● ఈనెల 14న రెండు బృందాలుగా 57 మంది రాక
● రామప్ప, వరంగల్‌కోట, వేయిస్తంభాల ఆలయం సందర్శన
● అప్రమత్తమైన అధికార యంత్రాంగం
● అదనపు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
● హైదరాబాద్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం
సాక్షిప్రతినిధి, వరంగల్ :
ప్రపంచ సుందరీమణుల పర్యటన నేపథ్యంలో ఓరుగల్లులో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, పర్యాటక తదితర శాఖల ఆధ్వర్యాన అతిథులను ఆకట్టుకునేలా పర్యాటక ప్రాంతాలను ముస్తాబు చేస్తున్నారు. ప్రధానంగా ప్రపంచ దేశాల నుంచి వస్తున్న సుందరీమణులకు మూడంచెల పోలీసు భద్రతతో పాటు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ ట్రైసిటీతో పాటు రామప్పలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను వారి పర్యటన ముగిసే వరకు హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) నుంచి కూడా పర్యవేక్షించేలా అనుసంధానం చేస్తున్నారు. బుధవారం నుంచి ఆ దిశగా పనులు ఊపందుకున్నాయి.
సీసీ కెమెరాల నిఘా..
నగరంలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసుశాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 49 వేల వరకు ఉన్నాయి. అలాగే ‘స్మార్ట్‌సిటీ’ నిధులతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 750 సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ నిర్వహిస్తున్నారు. అయితే వీటికి తోడు సుందరీమణుల పర్యటన నేపథ్యంలో హరిత కాకతీయ, వరంగల్ కోట, వేయిస్తంభాల ఆలయంలతో పాటు కీలక ప్రదేశాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే పనిలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. రామప్ప ఆలయ ప్రాంగణం, బయట సుమారు 50 నుంచి 70 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించే వీలుగా అనుసంధానం చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.