
సొంతూరిని వీడలేక..
● మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
● చికిత్స పొందుతూ ఎంజీఎంలో మృతి
దుగ్గొండి : సొంత గ్రామాన్ని వీడలేక.. భార్య, బిడ్డల వద్దకు వెళ్లలేక మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేసి మూడ్రోజులుగా చికిత్స పొందుతూ ఎంజీఎంలో మంగళవారం మృతి చెందాడు. దుగ్గొండి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన సర్వు రవి (40), రజిత దంపతులకు అమృత, ఐశ్వర్య పిల్లలు ఉన్నారు. వీరిని చదివించేందుకు వరంగల్‌కు వెళ్లి ఏదో ఒక పని చేసుకుని బతుకుదామని రజిత భర్తను కోరింది. అయితే రవికి ఎంత చెప్పినా వినక పోవడంతో చివరికి రజిత భర్తను వదిలి పిల్లలను తీసుకుని వెళ్లి వరంగల్‌లో ఉంటుంది. ఇదే విషయంపై ఊరి పెద్దలు రవికి సర్దిచెప్పినా వరంగల్‌కు వెళ్లక గోపాలపురంలోనే ఉంటానని అన్నాడు. ఈక్రమంలో అటు భార్య, పిల్లల వద్దకు వెళ్లలేక.. ఇటు సొంతూరిని వీడలేక మనస్తాపం చెంది ఈనెల 4న పురుగుల మందు తాగి తన తల్లి కొమురమ్మకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమె చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
ప్రాణంతీసిన.. పంచాయతీ ట్రాక్టర్
● ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి
కాళేశ్వరం : గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త సేకరించే ట్రాక్టర్‌ను డ్రైవర్ అతివేగంగా..అజాగ్రత్తగా నడపడంతో ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడి పైకి దూసుకు వెళ్లడంతో తీవ్ర గాయాలై మృతిచెందిన సంఘటన మండలంలోని పెద్దంపేటలో చోటు చేసుకుంది. మహాదేవ్‌పూర్ ఎస్సై పవన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దంపేటకు చెందిన జనగామ శ్రావణ్ కుమారుడు శాన్విక్ (2) మంగళవారం ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. అదే సమయంలో గ్రామ పంచాయతీలో చెత్త సేకరణ ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంతో డ్రైవింగ్ చేయడంతో బాలుడి పైకి దూసుకు వెళ్లగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి తండ్రి శ్రావణ్ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ కురుసం రామకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవన్‌కుమార్ పేర్కొన్నారు.

సొంతూరిని వీడలేక..