
ఏసీబీ వలలో జిల్లా పరిషత్ అధికారులు
ములుగు: ములుగు జిల్లాకేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కార్యాలయంలో రూ. 25వేలు లంచం తీసుకుంటున్న సూపరింటెండెంట్ సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సౌమ్యలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు 2023, జనవరి నుంచి అక్టోబర్ వరకు, 2024 జనవరి నుంచి జూన్ వరకు అనారోగ్య కారణాలతో సెలవు తీసుకున్నారు. తిరిగి విధుల్లోకి హాజరైనా పెండింగ్ వేతనం రాలేదు. సుమారు రూ. 3.50లక్షల వేతనం నిలిచిపోయింది. మంజూరుకు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించారు. ఉన్నతాధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. చివరికి సూపరింటెండెంట్ సుధాకర్‌ను కలిశాడు. రూ.60 వేలు ఇస్తే పెండింగ్ వేతనం వచ్చేలా చూస్తామని చెప్పడంతో ముందుగా రూ. 25 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. కానీ డబ్బులు సర్దుబాటు కాకపోవడంతోపాటు అధికారుల తీరుతో విసిగివేసారి ఎనిమిది రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు మంగళవారం ముందుగా జూనియర్ అసిస్టెంట్ సౌమ్యను కలిసి రూ.5 వేలు ఇవ్వబోయాడు. నా డబ్బులు రూ. 5వేలతోపాటు సూపరింటెండెంట్‌కు ఇవ్వాల్సిన రూ. 20వేలను ఆయనకే ఇవ్వాలని సౌమ్య చెప్పడంతో సూపరింటెండెంట్ సుధాకర్‌ను కలిసి రూ. 25 వేలు ఇస్తున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలోని టీం సభ్యులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సుమారు నాలుగు గంటల పాటు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వీరిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సాంబయ్య పేర్కొన్నారు.
రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్