గురుకులాల ద్వారా ఉచితంగా న్యాయవిద్య
కాజీపేటలోని బీసీ గురుకుల ఉమెన్ ‘లా’ కాలేజీ భవనం..
విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల క్రితం వరకు యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీల్లోనే ‘లా’ చదువుకోవాల్సి వచ్చేది. దీనికి వేలాది రూపాయల ఫీజులు చెల్లించాల్సిందే. ముఖ్యంగా యూనివర్సిటీల కాలేజీల్లో సీట్లకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ లాకాలేజీల్లోనూ అధిక ఫీజులు చెల్లించి చదువుతున్నారు. మేనేజ్‌మెంట్ కోటాలో సంవత్సరానికి రూ.లక్ష ఫీజు తీసుకునే కాలేజీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునే పేద విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో ఉచితంగా న్యాయ విద్యనందించేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితమే చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మహాత్మాజ్యోతిబాపూలే బలహీనవర్గాల విద్యాలయాల సంస్థ ద్వారా ఐదేళ్ల ‘లా’ కోర్సు ఉచితం అందజేస్తోంది. కాగా, కొన్నేళ్ల క్రితమే రాష్ట్రంలో హైదరాబాద్‌లోని చైతన్యపురిలో సాంఘిక సంక్షేమ గురుకులం బాలికల ‘లా’ కళాశాలగా ఉంది. అలాగే, సంగారెడ్డిలో గిరిజన సంక్షేమ గురుకులం బాలుర ‘లా’ కళాశాలగా ఉంది.
బీసీ గురుకులాల ద్వారా..
తెలంగాణ ప్రభుత్వం బీసీ గురుకులాల ద్వారా న్యాయ విద్యనందిస్తుంది. ఇందులో భాగంగా 2023–2024 విద్యాసంవత్సరంలో కాజీపేట సోమిడి రోడ్డులో గురుకుల ‘లా’ ఉమెన్ కళాశాల ఏర్పాటు చేసింది. అలాగే, హైదరాబాద్ మహేశ్వరంలో గురుకుల ‘లా’ మెన్ కాలేజీ నిర్వహిస్తోంది. వీటిల్లో ప్రవేశాలకు టీజీ లాసెట్ ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల్లో తక్కువ ఆదాయం కలిగిన పేద కుటుంబాలకు చెందిన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ‘లా’ గురుకులాల్లో అడ్మిషన్లు పొందొచ్చు.
అనేక సదుపాయాలు..
ఈ గురుకుల ‘లా’ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్ల గరిష్ట వయోపరిమితి 20 ఏళ్లు ఉంది. వివాహితులకు ప్రవేశం లేదు. విద్యార్థినులు అడ్మిషన్లు పొందాక తప్పనిసరిగా హాస్టల్ వసతి పొందాల్సింటుంది. ఉచితంగా హాస్టల్‌వసతితోపాటు మెస్‌సదుపాయం ఉంటుంది. ఉచితంగా యూనిఫామ్స్, బుక్స్, నోట్‌బుక్స్ కూడా అందజేస్తారు.
కాజీపేట గురుకుల కళాశాలలో 60 సీట్లు..
ప్రస్తుతం హనుమకొండ జిల్లా కాజీపేట సోమిడిలో ఉన్న గురుకుల ‘లా’ కళాశాలలో విద్యార్థినులకు ఈ విద్యాసంవత్సరం 2025–2026లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు 60 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ కళాశాలలో ఫస్టియర్‌లో 24 మంది, సెకండియర్‌లో 30 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ప్రతీ విద్యాసంవత్సరంలో 60 సీట్లు ఉన్నా పూర్తిస్థాయిలో భర్తీకావడం లేదు. న్యాయవిద్యలో స్థిరపడాలనుకునేవారు ఈ గురుకులంలో అడ్మిషన్లు పొందాలని అధికారులు కోరుతున్నారు. హైదరాబాద్‌లోని మహేశ్వరంలో గురుకుల ‘లా’ మెన్ కళాశాలలో కూడా 60 సీట్లు ఉన్నాయి.
ఇప్పటికే టీజీ లాసెట్ నోటిఫికేషన్
తెలంగాణలో వివిధ యూనివర్సిటీల పరిఽధిలోని ‘లా’ కళాశాలల్లో 2025–2026 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను ఉస్మానియా యూనివర్సిటీ ఇ ప్పటికే టీజీలాసెట్ నోటిఫికేషన్ జారీచేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అపరా ధ రుసుములేకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 15 వతేదీ వరకు గడువు ఉంది. రూ. 5 వందల అపరాధ రుసుముతో ఈనెల 25వరకు, రూ. వెయ్యితో మే 5 వరకు, రూ. 2వేలతో మే 15వరకు, రూ 4వేల అపరాధ రుసుముతోమే 25వతేదీవరకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ఉంది. కాగా, లాసెట్ జూన్ 6న జరగబోతుంది.
ఎవరికెన్ని సీట్లు..
బీసీ గురుకుల ‘లా’ కాలేజీలో ఉన్న 60 సీట్లలో బీసీఏ– 13, బీసీ– బీ 15, బీసీ–సీ 2, బీసీ –డీ 11, బీసీ –ఈ 6, ఈబీసీ 1, ఎస్సీ–9, ఎస్టీ –3 సీట్లు కేటాయిస్తారు. ఈ బీసీ గురుకులంలో మొదటి, రెండో సంవత్సరం కలిపి ప్రస్తుతం 54 మంది విద్యార్థినులు చదువుతున్నారు.లాసెట్ ద్వారానే ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు ఇవ్వనున్నారు.
ఐదేళ్ల ‘లా’ కోర్సు.. టీజీ లాసెట్ ద్వారానే సీట్ల భర్తీ
రెండేళ్ల క్రితం కాజీపేటలో ఉమెన్, హైదరాబాద్ మహేశ్వరంలో
మెన్ కళాశాలలు ఏర్పాటు..
హాస్టల్ వసతి, మెస్
ఇతర సదుపాయాలు
నామమాత్రపు ఫీజు
ఐదేళ్ల ‘లా’ కోర్సులో ప్రవేశానికి నామమాత్రపు ఫీజు కేవలం రూ. 4వేలు మాత్రమే ఉంది. రూ. 4వేలు కాషన్ డిపాజిట్‌గా అడ్మిషన్ల సమయంలో చెల్లించాల్సింటుంది. కోర్సు పూర్తిచేశాక విద్యార్థులకు తిరిగి చెల్లిస్తారు.
నాణ్యమైన న్యాయ విద్య
గురుకుల ‘లా’ ఉమెన్స్ కాలేజీలో నాణ్యమైన న్యాయ విద్యనందిస్తున్నాం. నిరంతర పర్యవేక్షణతోపాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన చేయిస్తున్నాం. న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనే విద్యార్థినులు గురుకుల ‘లా’ కళాశాలలో టీజీసెట్‌ద్వారా అడ్మిషన్లు పొందాలి.
– ఎన్ రవి, ప్రిన్సిపాల్, ఎంజేపీటీబీసీడబ్ల్యూ గురుకుల ‘లా’ ఉమెన్ కాలేజీ, కాజీపేట
గురుకులాల ద్వారా ఉచితంగా న్యాయవిద్య


