తాగునీటి సరఫరాపై దృష్టి
మహబూబాబాద్: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా మానుకోట మున్సిపల్ అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రస్తుతం మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతోంది. అయితే ఏదైనా సమస్య తలెత్తి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, వనరులపై దృష్టి పెట్టారు. మున్నేరు వాగులో రెండు నెలల పాటు సరిపోను నీరు ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.
లక్షకు పైగా జనాభా..
మానుకోట మున్సిపాలిటీ పరిధిలో స్థానికులతో పాటు విద్య, వ్యాపారం, ఉద్యోగ రీత్యా నివాసం ఉండే వారితో లక్ష జనాభా దాటుతుంది. 13,766 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. కాగా మిషన్ భగీరథ అర్బన్ సంప్ ద్వారా తాగునీటి పరఫరా చేస్తున్నారు. విలీన గ్రామాలతో కలిపితే మొత్తం 39 వాటర్ ట్యాంక్‌లు ఉన్నాయి. కాగా అర్బన్ సంప్ నుంచి గాయత్రి గుట్టపై ఉన్న వాటర్ ట్యాంకు, బైపాస్‌లోని ట్యాంక్, గాంధీ పార్క్‌లోని ట్యాంకు, సిగ్నల్ కాలనీ ట్యాంకు, కంకరబోడ్‌లోని ట్యాంకు, బీసీ కాలనీ ట్యాంకు, బాబూ నాయక్ తండా రోడ్డులో ఉన్న ట్యాంకులకు నీటి సరఫరా చేస్తున్నారు. ప్రతీరోజు మిషన్ భగీరథ నీరు 11 మిలియన్ లీటర్లు, జిల్లా కేంద్రం శివారు మున్నేరు వాగులో రెండు చెక్ డ్యామ్‌లలో నిల్వ ఉన్న నీటిలో ప్రతీరోజు 2 ఎంఎల్‌డీ వాటర్ సరఫరా చేస్తున్నారు. మున్నేరు వాగులోని ఫిల్టర్ బెడ్ ద్వారా పాత బజార్‌లోని కేటీఆర్ కాలనీ, అయ్యప్పనగర్‌తో పాటు పలు కాలనీలకు నీటి సరఫరా చేస్తున్నారు.
యాక్షన్ ప్లాన్ సిద్ధం..
వేసవికాలం కావడంతో తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో 61 బావుల్లో 30అడుగంటగా.. 28 బావులను ఉపయోగంలోకి తెచ్చారు. 340 చేతిపంపులు ఉండగా .. 331 పని చేస్తున్నాయి. 9 చేతి పంపుల్లో నీళ్లు లేవు. పవర్ బోర్లు 69 ఉండగా.. 9బోర్లలో నీళ్లు లేవని గుర్తించారు. డివైడర్లు, పార్కులు, పట్టణ ప్రకృతి వనాల్లో ఉన్న చెట్లకు నీళ్లు అందించడానికి నాలుగు ట్యాంకర్లు కొనుగోలు చేశారు. వాటిని నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ఉపయోగిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం రూ.8 లక్షలు కేటాయించారు. ప్రధానంగా కొన్ని దశాబ్దాలుగా మానుకోటకు మున్నేరు వాగే దిక్కు.. దానిలో రెండు నెలలకు సరిపోను నీరు ఉండడంతో ఫిల్టర్ బెడ్ నుంచి అన్ని ట్యాంకులకు కనెక్షన్ ఇచ్చారు. తద్వారా పట్టణమంతా నీటి సరఫరా జరగనుంది.
పలు ప్రాంతాల్లో సమస్య..
బ్యాంక్ కాలనీతో పాటు సిగ్నల్ కాలనీలోని కొంత ప్రాంతం, వెల్పుల సత్యం నగర్‌కాలనీతో పాటు పలు కాలనీల్లో తాగు నీటి సమస్య తలెత్తింది. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో పైపులైన్ మరమ్మతులు జరుగుతున్నాయి. ఈమేరకు గత కొద్ది రోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. కొండపల్లి గోపాల్‌రావు నగర్ కాలనీలో ఉన్న బావి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఆ బావిలో కూడా నీరు అడుగంటింది.
మానుకోట మున్సిపాలిటీలో
సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం
తాగునీటి పైపులైన్ల మరమ్మతులు, ఇతర పనులు
ప్రత్యామ్నాయ వనరులపై ప్రత్యేక దృష్టి
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రూ.8 లక్షల కేటాయింపు
పలుచోట్ల అడుగంటిన బావులు
పూర్తి కాని పైపులైన్‌తో సమస్య..
మిషన్ భగీరథ పథకంలో 127 కిలోమీటర్లు మాత్రమే పైపులైన్ నిర్మాణం చేశారు. 42 కిలోమీటర్ల మేరకు పాత పైపులైన్‌తో నీటి సరఫరా చేస్తున్నారు. 50 కిలోమీటర్ల మేరకు నిర్మాణం చేయాల్సి ఉంది. కాగా పాత పైపులైన్ ఉన్న ప్రాంతాల్లో లీకేజీలు ఇతర సమస్యలు వస్తున్నాయి. పైపులైన్ నిర్మాణం కోసం రూ.20 కోట్లు మంజూరు కాగా టెండర్ పూర్తి అయ్యిందని అధికారులు తెలిపారు.
పైపులైన్ టెండర్ పూర్తి
92 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం కోసం రూ. 20కోట్లు మంజూరు కాగా టెండర్ దశలో ఉంది. మిషన్ భగరీథ నీటి సమస్య వచ్చినా.. మున్నేరు వాగు నీరు సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. మిషన్ భగీరథ నీరు విషయంలో కూడా సమస్య లేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు .
–ఉపేందర్, మానుకోట మున్సిపల్ డీఈ
నీటి సమస్య లేకుండా చూస్తున్నాం..
సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి, తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించాం. పైపులైన్ మరమ్మతులు చేస్తున్నాం. ప్రస్తుతం సమస్య ఉన్న కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. మున్నేరు వాగులో కూడా రెండు నెలలకు సరిపోన్ నీరు నిల్వ ఉంది.
–నోముల రవీందర్, మున్సిపల్ కమిషనర్
తాగునీటి సరఫరాపై దృష్టి


