
మహాసభలో మాట్లాడుతున్న ఐలయ్య
నర్సంపేట: దేశ వ్యవసాయ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ పెట్టుబడిదారులకు అప్పగించి చేతులు దులుపుకున్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. ఈ మేరకు అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఐదో మహాసభలు ఆదివారం నర్సంపేట పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో జిల్లా అధ్యక్షుడు ఆబర్ల రాజన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అజమాయిషీ లేదని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించి ఎనిమిది సంవత్సరాలు అవుతుందని, కానీ, రైతుల అప్పులు మాత్రమే రెట్టింపు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం 12వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించి అమలు చేయడంలో విఫలం చెందిందని ఆరోపించారు. ఇటీవల తుఫాను వల్ల రైతులు కోట్ల రూపాయలు నష్టపోతే కేసీఆర్ నామమాత్రంగా నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకున్నాడని విమర్శించారు. దీనికి రాష్ట్ర సీపీఐ, సీపీఎం పార్టీలు వత్తాసు పలకడం నాలుగు సీట్ల కోసం వెంట తిరగడం సిగ్గుచేటు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ.. సమాజంలో ఉండే కులమత అంతరాలకు వ్యతిరేకంగా పని చేయాలన్నారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని మహాసభ ప్రతినిధులు ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆబర్ల రాజన్న, ప్రధాన కార్యదర్శిగా మొగిలి ప్రతాప్‌రెడ్డితో పాటు 11మంది సభ్యులను ఎన్నుకున్నారు. మహాసభలో విప్లవ రైతాంగ ఉద్యమంలో రాష్ట్ర నాయకురాలిగా పని చేసి ఇటీవల మృతి చెందిన బేబక్క, ఇతర అమవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ మహాసభకు ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్, సంఘ నాయకులు రాచర్ల బాలరాజు, జిల్లా నాయకులు జక్కుల తిరుపతి, గట్టి కృష్ణ, బోగి సారంగపాణి, బొమ్మడి సాంబయ్య, నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.
ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి
గౌని ఐలయ్య
నర్సంపేటలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా ఐదో మహాసభలు