
మంత్రికి సమస్యలు తెలియజేస్తున్న ఉద్యోగులు
హన్మకొండ: తమ న్యాయమైన డిమాండ్లు, సమస్యలు పరిష్కరించాలని నైబర్‌హుడ్ సెంటర్ ప్రొఫెషనల్స్, ఉద్యోగులు కోరారు. శనివారం హనుమకొండలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి పుష్పగుచ్ఛం, వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ నైబర్‌హుడ్ సెంటర్ ప్రొఫెషనల్స్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సురేష్, ప్రధాన కార్యదర్శి ఎం.కిరణ్ కుమార్ మాట్లాడుతూ సెర్ప్, డీఆర్‌డీఏ, ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న నైబర్ హుడ్ సెంటర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేడర్ ఫిక్సేషన్ కల్పించి, హెచ్‌ఆర్ వర్తింపజేయాలని కోరారు. నగరాలు, పట్టణాలకు దూరంగా ఏజెన్సీ ప్రాంత గిరిజనులు, సామాన్యులకు, దివ్యాంగులకు ఫిజియోథెరఫి, స్పీచ్ థెరఫి, స్పెషల్ ఎడ్యుకేషన్ వంటి సేవలు అందిస్తున్నామని, దివ్యాంగుల సాధికారత సాధిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ సమాజంలో మమేకం చేస్తున్న తమ పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు తగదని మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో అసోషియేషన్ కోశాధికారి వి.స్వాతి, మంజుల, వి.శైలజ, బి.యాకయ్య, బి.శిరీష తదితరులు పాల్గొన్నారు.