 
															నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలి
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
చిప్పగిరి: మోంథా తుపాన్‌తో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలని అలూరు ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో గురువారం ఎమ్మెల్యే మాట్లాడారు. భారీ వర్షాలకు అలూరు, చిప్పగిరి, దేవనకొండ, హాలహర్వి, హొళగుంద, ఆస్పరి మండలాల్లో మిరప, పత్తి, కంది, వేరుశనగ, సజ్జ, ఉల్లి, టమాట పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఇటీవల సాగు చేసిన పప్పుశనగ, మిరప తదితర పైర్లు నీట మునిగి కుళ్లిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రకృతి సైతం రైతులపై పగబట్టినట్లు ఉందని అన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం తక్షణమే సర్వే నిర్వహించి, రైతులకు వెంటనే పరిహారం అందించాలన్నారు.
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా హేమంత్‌కుమార్
● నేడు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి
శ్రీనివాస్ పదవీ విరమణ
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారిగా డాక్టర్ హేమంత్‌కుమార్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం కర్నూలులోని బహుళార్ధ పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయన కొద్ది నెలలుగా కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారిగా పనిచేస్తున్న గుడివాడ శ్రీనివాస్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఖాళీ అవుతున్న ఈ పోస్టులో డాక్టర్ హేమంత్‌కుమార్‌ను తాత్కాలికంగా నియమించారు.
61 ఇళ్లు నేలమట్టం
కర్నూలు(సెంట్రల్): మోంథా తుపాన్ ప్రభావంతో జిల్లాలో 61 ఇళ్లులు నేలమట్టం అయ్యాయి. ఈమేరకు ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. జిల్లాలో దెబ్బతిన్న పంటల అంచనా కొనసాగుతోంది. దాదాపు 35 వేలకుపైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పూర్తి స్థాయి వివరాలు వచ్చిన తరువాత ప్రభుత్వానికి కలెక్టర్ నివేదించనున్నారు.
వివాహ వెబ్‌సైట్ల పట్ల
అప్రమత్తంగా ఉండండి
కర్నూలు: వివాహ సంబంధ వెబ్‌సైట్ల (మ్యాట్రిమోనియల్) పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఇటీవలి కాలంలో వివాహ సంబంధ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్స్, సోషల్ మీడియా వేదికల ద్వారా మ్యాట్రిమోనియల్ మోసాలు జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రేమ, పెళ్లి పేరుతో వ్యక్తిగత, ఆర్థిక సమాచారం పొందే నేరగాళ్లు అమాయకుల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. నకిలీ పేర్లతో ఆకర్షణీయమైన ఫొటోలతో మ్యాట్రిమోనియల్ ప్రొఫైళ్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా మోసానికి గురైతే సైబర్ క్రైం టోల్‌ఫ్రీ నెంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
