
ఆలయ భద్రతా సిబ్బందిని పెంచాలి
ఓర్వకల్లు: కాల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయానికి భద్రతా సిబ్బందిని పెంచి రక్షణ కల్పించాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మూడు రోజుల క్రితం ఆలయంలో చోరీ జరిగిందని తెలుసుకున్న ఆయన సోమవారం దేవస్థానాన్ని సందర్శించారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం చోరీ జరిగిన తీరును ఈఓ మద్దిలేటిని అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన చోరీ ఫుటేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధికి కృషి చేశామన్నారు. ప్రహరీ నిర్మాణం, గదుల మరమ్మతుల నిమిత్తం రూ.5 కోట్లతో టీటీడీ బోర్డుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ప్రతిపాదనలు నిలిచిపోయాయన్నారు. ఆలయ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఆలయం జాతీయ రహదారి పక్కన ఉండటంతో ప్రహరీ నిర్మిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు. కాటసాని వెంట కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రంగనాథ్‌గౌడు, సింగిల్ విండో మాజీ చైర్మన్ నాగతిరుపాలు, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు జీకే వెంగన్న, గోపా రమణారెడ్డి, పాలకొలను రమేష్, కాల్వ, హుసేనాపురం గ్రామాల వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి