
‘థైరాయిడ్’ చికిత్సపై అవగాహన అవసరం
కర్నూలు(హాస్పిటల్): థైరాయిడ్ గ్రంధి చికిత్సపై వైద్య విద్యార్థులు మరింత అవగాహన పొందాలని కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ చెప్పారు. డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆదేశాల మేరకు ఆదివారం కర్నూలు మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ హరిచరణ్ అధ్యక్షతన జోనల్ సీఎంఈ నిర్వహించింది. ఇందులో కర్నూలు మెడికల్ కాలేజి, అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజి, శాంతిరామ్ మెడికల్ కాలేజి, విశ్వభారతి మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో భాగంగా థైరాయిడ్ జబ్బుల గురించి సీఎంఈ నిర్వహించారు. థైరాయిడ్ గ్రంధికి సంబంధించిన వివిధ వ్యాధుల గురించి, అందులో వచ్చే వివిధ రకాల క్యాన్సర్ల గురించి, వాటి చికిత్స గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మాట్లాడుతూ థైరాయిడ్ గ్రంధి శరీరంలో చాలా ముఖ్యమైనదన్నారు. వాటికి సంబంధించిన వివిధ రకాల జబ్బుల గురించి పీజీలకు అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ థైరాయిడ్ గ్రంధి సైజు పెరిగినప్పుడు తప్పకుండా సర్జన్లకు చూపించుకుని దానికి పరీక్షలు చేయించి అవసరమైన చికిత్స తీసుకోవాలని సూచించారు. అనంతరం నాలుగు కాలేజీలకు జరిగిన క్విజ్ పోటీలో కర్నూలు మెడికల్ కాలేజి పీజీలు ప్రథమ స్థానం, శాంతిరామ్ మెడికల్ కాలేజి పీజీలు రెండో స్థానం పొందారు. కార్యక్రమంలో జోనల్ కో ఆర్డినేటర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయిసుధీర్, సీఎంఈ అబ్జర్వర్ డాక్టర్ విశాల, సీఎంఈ సర్జరీ కో ఆర్డినేటర్ డాక్టర్ మాధవీశ్యామల, జనరల్ సర్జరీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీలు పాల్గొన్నారు.