
తెలుగును అధికార భాషగా అమలు చేయాలి
కర్నూలు కల్చరల్: తెలుగును అధికార భాషగా అమలు చేయాలని, బోధన, పాలన మాతృభాషలోనే సాగాలని విశ్రాంత ఐఏఎస్ ముక్తేశ్వరరావు అన్నారు. కర్నూలు సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి తెలుగు భాషా పరిరక్షణ సదస్సు ఆదివారం ముగిసింది. తమిళనాడు రాష్ట్రం తెలుగు భాషా సంఘం అధ్యక్షులు తూమాటి సంజీవరావు, సదస్సు సమన్వయకర్త పత్తి ఓబులయ్య, సదస్సు అధ్యక్షులు చంద్రశేఖర కల్కూర, ఉపాధ్యక్షులు జేఎస్‌ఆర్కే శర్మ, కార్యదర్శి డాక్డర్ దండబోయిన పార్వతీ దేవి మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. మాతృభాషను కాపాడుకునే దిశలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. తూమాటి సంజీవరావు రచించిన ‘విశిష్ట తెలుగు దిగ్దర్శనం’ పుస్తకావిష్కరణ చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రథినిథులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారు చేసిన ప్రతి పాదనలను తీర్మానాలుగా చేశారు. వీటిని అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాని నిర్ణయించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తమిళళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలో వారివారి మాతృభాషలను ఎలా కాపాడుకుంటున్నారో తెలుగును అధికార భాషగా వంద శాతం అమలు చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నరసం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ, శ్యామసుందర శాస్త్రి, లక్ష్మయ్య, గుబ్బ బాలస్వామి, హైమావతి, నీలిమ, సునీత, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి తెలుగు భాషా పరిరక్షణ
సదస్సులో వక్తలు