వాహన సామర్థ్య పరీక్షలు అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

వాహన సామర్థ్య పరీక్షలు అస్తవ్యస్తం

Jul 11 2025 6:29 AM | Updated on Jul 11 2025 6:29 AM

వాహన సామర్థ్య పరీక్షలు అస్తవ్యస్తం

వాహన సామర్థ్య పరీక్షలు అస్తవ్యస్తం

ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌లో

డబ్బులు ఇవ్వాల్సిందే

ఫైళ్ల చివర ఏజెంటు పేరు

తెలిసేలా ‘కోడ్‌’

వసూళ్ల కోసం ఏటీఎస్‌ నిర్వాహకుని

సొంత సైన్యం

ఫోన్‌పే లేదా నేరుగా మామూళ్లు

ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌

కర్నూలు: భారీ వాహనాలు, రవాణా వాహనాలకు ఆటోమేటిక్‌ ఫిట్‌నెస్‌ టెస్టు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కర్నూలు నుంచి డోన్‌కు వెళ్లే జాతీయ రహదారి పక్కన చిన్నటేకూరు గ్రామ శివారులో వసుధ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు ఏజెన్సీ వారు ఏర్పాటు చేసిన ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ సేవలు మే 16వ తేదీ నుంచి జిల్లాలో అందుబాటులోకి వచ్చాయి. మరుసటి రోజు నుంచే అదనపు వసూళ్ల పర్వం ప్రారంభించినట్లు వాహనదారులు వాపోతున్నారు. ఈ కేంద్రం ఏర్పాటు కాకముందు మాన్యువల్‌ విధానంలో కర్నూలు డీటీసీ కార్యాలయం, ఆదోని యూనిట్‌ కార్యాలయంలో వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. అందులో మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ)లదే కీలకపాత్ర. ఇందుకోసం అధికారులు కూడా భారీగా మామూళ్లు వసూలు చేసేవారు. ఎఫ్‌సీ ధ్రువపత్రాల జారీలో అక్రమాలను నిలువరించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అధికారులు అమ్యామ్యా లకు, దళారుల విచ్చలవిడి దందాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన ఏటీఎస్‌ కేంద్రంలో కూడా సాంకేతిక మార్పులతో వసూళ్ల పర్వం కొనసాగుతోంది.

ఏజెంట్ల వారీగా కోడ్‌

ఏజెంట్‌ ద్వారా వెళ్లే ఫైల్‌కు చివరన కోడ్‌ వేస్తారు. అది ఏజెంట్‌ పేరును తెలియజేస్తుంది. ఏయే ఏజెంట్‌ ద్వారా ఏ రోజు ఎన్ని ఫైళ్లు (దరఖాస్తులు) ఏటీఎస్‌ కేంద్రానికి వచ్చాయో కోడ్‌ ద్వారా తెలుస్తుంది. ఆ ఏజెంట్‌ దగ్గరకు ఏటీసీ నిర్వాహకుడు నియమించుకున్న వ్యక్తి వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు వంటి దూర ప్రాంతాలతో పాటు కర్నూలులోని కొంతమంది ఏజెంట్ల ద్వారా వీలును బట్టి తరచూ ఫోన్‌ నంబర్లు మారుస్తూ ఫోన్‌ పే ద్వారా కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఏజెంట్లకు సంబంధించిన ఆధార్‌, ఫోన్‌ నంబర్లు సేకరించారు. ఎఫ్‌సీ కోసం ఫైల్‌ తీసుకుని వెళ్లి వ్యక్తి అక్కడి కార్యాలయంలో ఏజెంట్‌ పేరు చెబితే ఓటీపీ జనరేట్‌ చేశాక ఏజెంట్ల నుంచి ఫోన్‌పే ద్వారా కూడా మామూళ్లు వసూలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. మామూళ్లు ఇస్తే వాహనం ఎలా ఉన్నా ఆమోద ముద్ర వేసి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. లేదంటే బ్రేకులు సరిగా లేవనో, రంగులు, నంబర్‌ ప్లేట్లు, రేడియం స్టిక్కర్లు సరిగా లేవంటూ సాంకేతికతను సాకుగా చూపి వాహనాన్ని వెనక్కు పంపి ఏజెంట్లను ఆశ్రయించేలా చేస్తున్నారని వాహనదారులు లబోదిబోమంటున్నారు.

ప్రతిరోజూ 30 నుంచి 40 వాహనాలు

వాహన సామర్థ్య పరీక్షలకు ఏటీఎస్‌ కేంద్రానికి ప్రతిరోజూ 30 నుంచి 40 వాహనాలు వెళ్తుంటాయి. లోపలికి వెళ్లి కార్యాలయంలో ఏజెంటు పేరు చెబితే గానీ పని జరగడం లేదని వాహనదారులు వాపోతున్నారు. వాస్తవానికి వాహన సామర్థ్య పరీక్ష సేవలను ఆన్‌లైన్‌ చేశారు. కానీ ఆఫ్‌లైన్‌లో దరఖాస్తును తీసుకువెళ్లి ముడుపులు ముట్టజెప్పిన వాహనదారులకే ఎఫ్‌సీ ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రత్యక్షంగా తనిఖీలు చేసి ధ్రువపత్రాలు జారీ చేసేవారు. అప్పుడు కూడా ముడుపులు వసూలు చేస్తున్నప్పటికీ ఏసీబీ తనిఖీల భయంతో చూసీచూడనట్లుగా వ్యవహరించేవారు. ఎఫ్‌సీ సేవలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం, వారిపై అధికారుల అజమాయిషీ (తనిఖీ అధికారం) లేకపోవడం వల్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మామూళ్లు వసూలు చేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు.

వసూళ్ల ధర నిర్ణయించేందుకు

ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం...

ఫిట్‌నెస్‌ సేవలకు ఏయే రకం వాహనానికి ఎంత అదనపు రుసుం వసూలు చేయాలనే దానిపై ఏటీఎస్‌ ప్రారంభం తర్వాత నిర్వాహకులు ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ధరల పట్టికను నిర్ణయించారు. దాని ప్రకారమే వాహనదారుల నుంచి ఏజెంట్లు వసూలు చేసి ముట్టజెబుతున్నారు. వాహనాల చక్రాల సంఖ్యకు అనుగుణంగా ఎంత వసూలు చేయాలో నిర్ణయించారు. పది చక్రాల టిప్పర్‌, 12 చక్రాల టిప్పర్‌, 14, 16 చక్రాల లారీలు, నాలుగు చక్రాల గూడ్స్‌ వాహనాలు, ఆరు చక్రాల ఎంజీవీ, అన్ని రకాల వాహనాలకు, బస్సు, ట్రాక్టర్‌ ఇలా అన్ని రవాణా వాహనాలకు ధరలు నిర్ణయించారు. ఈ చెల్లింపులు అనధికారం. ఆటోకు రూ.600, టాటా ఏస్‌, బొలెరో, నాలుగు చక్రాల గూడ్స్‌ వాహనాలకు రూ.1200, సెవెన్‌ సీటర్‌ మోటర్‌ క్యాబ్‌నకు రూ.2 వేలు, టెంపో వాహనాలకు రూ.2,500, ఎంజీవీ వాహనాలకు రూ.2,500, పది చక్రాల టిప్పర్‌కు రూ.3 వేలు, 12 చక్రాల లారీ (టిప్పర్‌)కు రూ.3,200, 14, 16 చక్రాల లారీకి రూ.4 వేలు, బస్సుకు రూ.3,500, ట్రాక్టర్‌కు రూ.వెయ్యి చలానా ఫీజులతో పాటు అదనంగా వసూలు చేస్తుండటంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఏ వాహనానికి ఎంత మామూళ్లు వసూలు చేయాలో ముందుగానే ధర నిర్ణయించి కరపత్రం రూపంలో ఏజెంట్లకు అందజేయడం, ఆ ప్రకారమే మామూళ్లు వసూలు చేస్తుండటం రవాణా శాఖలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ఆదోని ప్రాంతానికి చెందిన టిప్పర్‌ యజమాని ఎఫ్‌సీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఏటీఎస్‌ కేంద్రానికి వెళ్లాడు. వాహనం బ్రేక్‌లు సరిగా లేవని, రేడియం స్టిక్కర్లు లేవని వెనక్కు పంపారు. రెండు గంటల తర్వాత ఏజెంట్‌ ద్వారా ముడుపులు ముట్టజెప్పి వెళ్లడంతో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు.

కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి తన గూడ్స్‌ వాహనం సామర్థ్య పరీక్ష కోసం (ఫిట్‌నెస్‌) ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఏటీఎస్‌ కేంద్రానికి వెళ్లాడు. పలు సాంకేతిక కారణాలతో తిరస్కరించారు. అన్నీ సక్రమంగా ఉన్నా ఇలా జరిగిందేంటని తెలిసిన వారిని అడిగితే ఓ ఏజెంట్‌ ఫోన్‌ నంబర్‌ ఇవ్వగా అక్కడికి వెళ్లి వివరాలు చెప్పాడు. అదే దరఖాస్తుపై ఏజెంట్‌ కోడ్‌ వేసి రూ.2,500 ముడుపులు సమర్పించుకోగా మరుసటి రోజు ఆ ఫైల్‌ ఆమోదం పొంది వాహనానికి సామర్థ్య పరీక్షా పత్రం జారీ చేశారు. దీంతో దరఖాస్తుదారుడు అవాక్కయ్యాడు.

ఇలా వాహనాలకు సామర్థ్య పరీక్ష (ఎఫ్‌సీ) ధృవపత్రం కావాలంటే మూడు చక్రాల వాహనానికి ఒక రేటు, నాలుగు చక్రాల వాహనానికి మరో రేటు, మోటర్‌ క్యాబ్‌లు, టెంపో వాహనాలకు ఇంకో రేటు నిర్ణయించి ఏటీఎస్‌ కేంద్రం నిర్వాహకులు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వాహనదారులు నేరుగా వెళ్తే ఏవో సాకులతో మళ్లీ మళ్లీ తిప్పుతూ ఏజెంట్లను ఆశ్రయించేలా పరిస్థితులు కల్పిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ ఏజెంట్ల ప్రమేయం లేకుండానే పనులు జరగాలి. కానీ ఈ కేంద్రానికి వచ్చిన ఫైలు ఏ ఏజెంటుదన్న విషయం తెలుసుకున్న తర్వాతే పని చక్కబెడుతున్నారు. ప్రభుత్వ చలానా (ఫీజు)కు అదనపు మొత్తాన్ని వాహనదారులు చెల్లించుకోవాల్సి వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement