
ఆత్మహత్యలే శరణ్యం
● సెల్‌టవర్ ఎక్కిపంచాయతీ కార్మికుల నిరసన
కోడుమూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని నగర పంచాయతీ కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం గూడూరు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు ఆరవింద్, మధు మాట్లాడుతూ.. చాలీచాలని జీతాలతో పనిచేస్తూ తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. 15 సంవత్సరాలకు పైబడి పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయడంతో పాటు నెలనెలా సక్రమంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం 46రోజుల నుంచి విధులు బహిష్కరించి నిరవధిక దీక్షలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిరసనలో కార్మికులు డూకేశ్వరరావు, షబ్బీర్, ఆంజనేయులు, బసవరాజు, జయన్న, అల్లిబాషా, ఖాజా, ప్రభాకర్, ఉసేన్, పఠాన్ తదితరులు పాల్గొన్నారు.