
7న ఐఏబీ సమావేశం
కర్నూలు సిటీ: సాగునీటి సలహా మండలి సమావేశం ఈనెల 7న నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతించారని జల వనరుల శాఖ కర్నూలు సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ బాలచంద్రారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు ప్రధాన జల వనరు తుంగభద్ర జలాలు. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే ఉండడంతో పాటు, డ్యాం ఎగువన ఉన్న నరీ పరీవాహక ప్రాంతంతో పాటు, పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తుండడంతో డ్యాంలోకి వరద నీరు భారీగానే వచ్చి చేరుతోంది. దీంతో కర్ణాటక నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) గత నెల 27న బెంగళూరులో సమావేశమై కాలువలకు నీటిని విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఆ మేరకు ఈ నెల 10వ తేది నుంచి తుంగభద్ర దిగువ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. అందులో భాగంగానే కర్ణాటక వాటా నీటితో కలిపి ఏపీ కోటా నీటి విడుదలకు టీబీ బోర్డుకు ఇండెంట్ పెట్టనున్నారు. 2025–26 నీటి సంవత్సరంలో టీబి డ్యాం నీటి లభ్యత 120 టీఎంసీలుగా అంచనా వేశారు. ఈ మేరకు ఎల్‌ఎల్‌సీ కాలువకు 13.585 టీఎంసీల నీరు, కేసీ కాలువకు 5.66 టీఎంసీల నీటిని కేటాయించారు. జిల్లాలో ఎల్‌ఎల్‌సీ, కేసీ కాలువ, ఏబీసీ, జీడీపీ, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, హంద్రీనీవా, పులికనుమ రిజర్వాయర్లు ఉండగా, వీటి పరిధిలో సుమారు 3లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.