
క్వాలిటీ కంట్రోల్ డీఈఈగా మధుసూదన్
కర్నూలు(అర్బన్): గ్రామీణ నీటి సర ఫరా విభాగం ఉమ్మ డి కర్నూలు జిల్లా క్వాలిటీ కంట్రోల్ డీఈఈగా బీవీ మధుసూదన్ స్థానిక జెడ్పీ ప్రాంగణంలో ని క్యూసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు క్యూసీ డీఈఈగా విధులు నిర్వహించిన కుష్‌కుమార్‌రెడ్డి గత జూన్ 30న పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లె ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో క్యూసీలో పనిచేస్తున్న ఇంజనీర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించి జిల్లాలో కొనసాగుతున్న పనులపై చర్చిస్తామన్నారు. అనంతరం జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
ఆరాధన ఉత్సవాల నిర్వహణపై సమీక్ష
మంత్రాలయం : ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో వచ్చే నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆరాధన ఉత్సవాలు జరగనున్నాయి. మంగళవారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులు, శ్రీమఠం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరాధన ఉత్సవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాంతి భద్రతలు, భక్తుల సౌకర్యాలు, నది తీరంలో భక్తుల స్నానాలు, వసతులు, ప్రసాదాలు వంటి అంశాలతో మధ్యారాధన, రథోత్సవం రోజు తీసుకోవాలసిన భద్రతపై పోలీసు, రెవెన్యూ, ఎండోమెంట్, ఫైర్ సిబ్బంది తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అలాగే గ్రామ సర్పంచ్ బాధ్యతీసుకుని స్వచ్ఛతపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని శ్రీమఠం మేనేజర్ ఎస్‌కే శ్రీనివాస్‌రావు సూచనలు చేశారు.
స్పౌజ్ పింఛన్ల పంపిణీలో చేతులెత్తేసిన ప్రభుత్వం
కర్నూలు(అగ్రికల్చర్): స్పౌజ్ పింఛన్ల పంపిణీపై కూటమి ప్రభుత్వం వితంతు మహిళలను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తోంది. ముందుగా జూన్ 12న పంపిణీ చేస్తున్నామంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. నిధులు కూడా బ్యాంకులకు విడుదల చేసినట్లు ప్రకటించింది. అయితే ఆ రోజు పింఛన్లు పంపిణీ చేయలేక చేతులెత్తేసింది. జూలై నెల పింఛన్లతో పాటు స్పౌజ్ పింఛన్లను కూడా పంపిణీ చేస్తామని ఇటీవల ప్రకటించారు. అయితే మంగళవారం పింఛన్ల పంపిణీ సమయానికి స్పౌజ్ పింఛన్ల పంపిణీని నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వితంతు మహిళల్లో ఆందోళన నెలకొంది. దాదాపు నెల రోజుల క్రితం నుంచి వేలాది మంది మహిళలను కూటమి ప్రభుత్వం ఊరిస్తోంది. కర్నూలు జిల్లాలో 2,319, నంద్యాల జిల్లాలో 2,463 ప్రకారం స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినా, పంపిణీలో మొండిచేయి చూపుతుండటం విమర్శలకు తావిస్తోంది.
పింఛన్ల పంపిణీలో 19వ స్థానం
పింఛన్ల పంపిణీలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లా రాష్ట్రంలో 19వ స్థానం, నంద్యాల జిల్లా 16వ స్థానంలో నిలిచాయి. ఎక్కువ భాగం సచివాలయాలు, రచ్చబ ండల వద్దే పింఛన్ల పంపిణీ చేపట్టడం గమనార్హం.

క్వాలిటీ కంట్రోల్ డీఈఈగా మధుసూదన్