
మా పాఠశాలలోనే చదువుకుంటాం!
కర్నూలు(సెంట్రల్): ‘మా పాఠశాల మాకే కావాలి.. వేరే పాఠశాలకు వెళ్లమని’ కర్నూలు నగరంలో ని బి.క్యాంప్ నగరపాలక ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట భీష్మించారు. మంగళవార ఉదయమే విద్యార్థులు కలెక్టరేట్‌కు చేరుకొని తమను అదే పాఠశాలలో కొనసాగించాలని కోరుతూ నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు తరగుతులు ఉన్నాయి. అయితే 6, 7, 8 తరగతులను సమీపంలోని బి.క్యాంపు బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం విలీనం చేసింది. దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు తాము మరో పాఠశాలకు వెళ్లమని, అదే పాఠశాలలో చదువుకుంటామని చెప్పారు. కాగా, అటుగా వెళ్తున్న డీఈఓ శామ్యూల్‌పాల్ విద్యార్థుల వద్దకు వచ్చి పాఠశాలకు వెళ్లాలని కోరారు. అయితే వారు మా పాఠశాలకే వెళ్తామని, విలీన పాఠశాలకు వెళ్లమని చెప్పడంతో ఆయన ఏమీ చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, విద్యార్థుల ఆందోళనకు ఏఐడీఎస్‌ఓ, పీడీఎస్‌యూ, బీఎస్‌యూ విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి.