
జాడలేని వరుణుడు
● రైతులను ఊరించిన ముందస్తు వర్షాలు ● ఇప్పటికే లక్ష హెక్టార్లలో పంటల సాగు ● జూన్ నెలలో దాదాపు 20 మండలాల్లో అత్యల్ప వర్షపాతం ● దెబ్బతింటున్న పత్తి, ఉల్లి, వేరుశనగ తదితర పంటలు
మంచి పదునులోనే విత్తనం
వేసుకోవాలి
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అంతంతమాత్రం తేమలో విత్తనం విత్తుకోవద్దు. నల్లరేగడి నేలల్లో 75 మి.మీ వర్షపాతం ఒక్క రోజులో నమోదైనా, లేదా వరుసగా మూడు రోజుల్లో నమోదైనప్పుడు మాత్రమే విత్తనం వేసుకోవాలి. ఎర్ర నేలల్లో కనీసం మూడు రోజులు లేదా ఒక్కరోజులో 50 మి.మీ వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే విత్తనం వేసుకోవడం మంచింది. అంతంతమాత్రం తేమలో విత్తనం వేసుకుంటే మొలక సరిగా రాదు. రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. – సుజాతమ్మ,
ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త
కోడుమూరు మండలం వర్కూరు వద్ద వాడు పట్టిన పత్తి పంట
మాకున్న 8 ఎకరాల పొలం ఉంటే ఆరు ఎకరాల్లో పత్తి సాగు చేశాం. ఇప్పటికే రెండు సార్లు మందులు పిచికారీ చేశాం. బిటీ విత్తన ప్యాకెట్లు, ఎరువులు, ఎద్దుల బాడుగలు తదితరాలకు ఎకరాకు రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టాం. జూన్ నెలలో వర్షాలు లేక పత్తి పంట దెబ్బతినింది. మా గ్రామంలో 75 శాతం పత్తి సాగు చేస్తాం. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, పంటల బీమాతో ఆదుకుంటే తప్ప రైతులు కోలుకునే పరిస్థితి లేదు.
– మోహన్‌రెడ్డి, జాలవాడి గ్రామం, పెద్దకడబూరు మండలం
కర్నూలు(అగ్రికల్చర్): వరుణుడి జాడలేకపోవడంతో ఖరీఫ్ సాగు ఆందోళన కలిగిస్తోంది. ముందస్తు రుతుపవనాలు సంతోషం కలిగించినా నాలుగైదు రోజులకే పరిమితమైంది. సీజన్‌లో నెల గడచిపోతున్నప్పటికీ పంటల సాగు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. జూన్ నెలలో పురోగమించాల్సిన వ్యవసాయం తిరోగమన దిశగా పయనిస్తోంది. 2024–25లో అధిక వర్షాలు, అనావృష్టితో వ్యవసాయం కలసిరాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2025–26 సంవత్సరానికి రుతుపవనాలు మే నెల చివరి వారంలోనే విస్తరించాయి. ముందస్తు రుతుపవనాలతో రైతులు సంతోషించారు. అయితే కొద్ది రోజులకే రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో సాగు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్ సాధారణ సాగు 4,22,540 హెక్టార్లు ఉండగా.. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం 1,15,423 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇప్పటికే దాదాపు 2లక్షల హెక్టార్లలో పంటలు సాగైనట్లు తెలుస్తోంది. మే నెల సాధారణ వర్షపాతం 40.1 మి.మీ ఉండగా.. రికార్డు స్థాయిలో 106.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో పత్తి సాగు భారీగా పెరిగింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.1 మి.మీ ఉండగా.. 74.3 మి.మీ వర్షపాతం కురిసింది. దాదాపు 20 మండలాల్లో అత్యల్ప వర్షాలు కురిశాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండాల్సిన మే నెలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. వర్షాలు కురవాల్సిన జూన్ నెలలో ఎండలు, గాలుల తీవ్రత పెరిగింది. ఫలితంగా నెలల్లో తేమ ఆరిపోతుండటంతో పంటలు దెబ్బతింటున్నాయి. ఆదోని, ఆలూరు, ఆస్పరి, పెద్దకడుబూరు, పత్తికొండ, మద్దికెర, హాలహర్వి, మంత్రాలయం, దేవనకొండ, సి.బెళగల్, కోడుమూరు, కల్లూరు తదితర మండలాల్లో పత్తి, ఉల్లి సాగు ఎక్కువగా ఉంది. జూన్ మాసంలో వర్షాలు తేలికపాటికే పరిమితం కావడంతో పంటల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
కన్నీరు పెడుతున్న ఆస్పరి
పశ్చిమ ప్రాంతంలోని ఆస్పరి మండలంలో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మండలంలో జూన్ నెల సాధారణ వర్షపాతం 91.8 మి.మీ. అయితే మూడు రోజులు మాత్రమే వర్షం కురిసింది. 26 రోజులు చినుకు జాడ లేకుండాపోయింది. జూన్ 12న ఒక మోస్తరుగా 35 మి.మీ వర్షపాతం నమోదైంది. 21న తూతూమంత్రంగా 2.2, 23న 6.0 మి.మీ ప్రకారం కేవలం 43.2 మి.మీ వర్షపాతం మాత్రమే కురిసింది. సాధారణ వర్షపాతంలో కనీసం 50 శాతం కూడా వర్షాలు లేని పరిస్థితి. దీంతో ఈ మండలంలో సాగు చేసిన పత్తి, ఉల్లి, టమాట తదితర పంటలు తేమ లేక దెబ్బతింటున్నాయి.
ఖరీఫ్ గట్టెక్కడం అనుమానమే!
పత్తి పంట ఎండుతోంది
ముందస్తు వర్షాలతో రైతులు ఉత్సాహంగా పంటలు సాగు చేశారు. ఒక రోజు మధ్యాహ్నం వరకు ఒక కాడి బాడుగకు తీసుకోవాలంటే రూ.2వేల నుంచి రూ.2,500 వరకు చెల్లించాల్సి ఉంది. ఉల్లి విత్తనాలు కిలో ధర రూ.1,500 వరకు ఉంది. పత్తి 450 గ్రాముల ప్యాకెట్ ధర రూ.900. సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశనగ క్వింటా పూర్తి ధర రూ.9,300. రసాయన ఎరువుల ధరలు షాక్ కొడుతున్నాయి. ఉల్లి, పత్తి, వేరుశనగ, కంది సాగులో ఇప్పటికే సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టా రు. జూన్ మాసంలో వర్షాలు లేకపోవడంతో జిల్లాలో సాగు చేసిన పంటలన్నీ దెబ్బతినే పరిస్థి తి ఏర్పడింది. వర్షాభావ పరిస్థితులతో పెట్టిన పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే ఖరీఫ్ గట్టెక్కడం అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ చిత్రం.. రైతు కన్నీటి కష్టానికి నిదర్శనం. పంపుసెట్‌తో పత్తి మొక్కలకు నీటిని పిచికారీ చేస్తున్న రైతు పేరు బంద. ఊరు గోనెగండ్ల. నాలుగు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పైరు వానల్లేక ఎండిపోతుండటంతో కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు.

జాడలేని వరుణుడు

జాడలేని వరుణుడు

జాడలేని వరుణుడు