
నీటి విడుదలపై 27న సమావేశం
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ, ఇతర కాలువలకు నీటి విడుదలపై ఈ నెల 27న బెంగళూరు విధాన సౌధలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు, నీటి సలహా మండలి సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో 124వ నీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు శుక్రవారం తెలిపారు. గతేడాది వరద నీటి ప్రవహానికి డ్యాం 19వ క్రస్టుగేటు కొట్టుకుపోవడంతో సాట్ప్‌లాక్ గేటు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టాప్‌లాక్ గేటు స్థానంలో కొత్త గేటుతో పాటు మిగిలిన 32 క్రస్టుగేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు గాను పనులు మొదలు పెట్టేందుకు ఒక పంటకు (ఖరీఫ్) మాత్రమే నీరిచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. అయితే దీనిపై కర్ణాటకలోని తుంగభద్ర రైతు సంఘం నాయకులు, రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపడ్తామని హెచ్చరికలు చేస్తున్నారు. డ్యాంలో కూడా 40 టీఎంసీల నీరు చేరడంతో కాలువలకు ముందుగానే నీటిని విడుదల చేయడం, రైతుల వ్యతిరేకత, ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని డ్యాంలో నిల్వ అయ్యే నీటితో ఆయా రాష్ట్రాల కాలువలకు నీటి విడుదుల, కేటాయింపులపై చర్చించనున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది టీబీ డ్యాం నీటిపై గందరగోళం నెలకొనడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం టీబీ డ్యాంలో 1612 అడుగుల వద్ద 44 టీఎంసీల నీరు నిల్వ ఉంది.