ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం

Jun 20 2025 6:01 AM | Updated on Jun 20 2025 6:01 AM

ఇది ర

ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా గురురాఘవేంద్ర ప్రాజెక్టులో ఇసుమంత అభివృద్ధి కనిపించలేదు. పనిచేయని పంపుహౌస్‌లు, చోరీకి గురైన ప్రాజెక్టు సామగ్రి ‘విధ్వంస’ పాలనను చూపుతున్నాయి. వరుణుడు కరుణించినా జలాశయాలు వెలవెలబోతున్నాయి. ఆయకట్టు భూములు బీళ్లను తలపిస్తున్నాయి. పంట పొలాల్లో రైతుల కన్నీళ్లే పారుతున్నాయి. అయినా సీఎం చంద్రబాబు స్పందించడం లేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం ఎమ్మిగనూరులో గురురాఘవేంద్ర ప్రాజెక్టు కార్యాలయం ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
● గురురాఘవేంద్ర ప్రాజెక్టును పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● పనిచేయని జీఆర్‌పీ పంపుహౌస్‌లు ● ధ్వంసమైన ట్రాన్స్‌ఫార్మర్‌లు ● వెలవెలబోతున్న ఎత్తిపోతల పథకాలు ● మరమ్మతులకు అందని నిధులు ● గురురాఘవేంద్ర ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

మంత్రాలయం: తుంగభద్ర దిగువ కాలువ శివారు ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు గురురాఘవేంద్ర ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు పరిధిలో ఒక మైనర్‌ ఇరిగేషన్‌, 11 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 50 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. నీరందక గతేడాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరి ఆయకట్టు భూములను బీళ్లుగా పెట్టుకున్నారు. తీవ్ర కరువుతో చాలా మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్న ఊరిని వదిలి జీవనోపాధి నిమిత్తం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా రాష్ట్ర ప్రభుత్వంలో కనీస స్పందన కరువైంది. గురురాఘవేంద్ర ప్రాజెక్టును రైతులకు తీసుకొచ్చేందుకు మరమ్మతులకు నిధులను కూడా కేటాయించలేదు.

వర్షాధారమే ఆధారం

ముఠా చోరీల కారణంగా ఆరు ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యమయ్యాయి. పంపుహౌస్‌ల మరమ్మతుల కోసం రూ.17 కోట్లు అంచనాతో ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు పంపి ఏడాది కావొస్తున్నా కూటమి ప్రభుత్వం కరుణించడం లేదు. కేవలం రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి (ఎస్‌డీఎంఎఫ్‌) కింద రూ.1.28 కోట్లు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంది. పథకం పరిధిలో 7 పనులు, జీతాలకు ఈ నిధి సరిపోయింది. ప్రభుత్వం చేతులెత్తేయడంతో గతేడాది మూగలదొడ్డి, పూలచింత పథకాలను రైతులే చందాలు వేసుకుని నడుపుకోవాల్సి వచ్చింది. ఇక చిలకలడోణ, మాధవరం, బసలదొడ్డి పథకాల నుంచి సెంటు భూమికి నీరివ్వలేదు. పథకాల పరిధిలో దాదాపు 20 వేల ఎకరాలు వర్షాధారంగా మారింది.

అన్నదాతల ఆందోళన బాట

కూటమి ప్రభుత్వ కాఠిన్యంపై రైతులు వేసారి పోయారు. రైతులంతా ఏకమై నిరసన బాట పట్టారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఎమ్మిగనూరులోని గురురాఘవేంద్ర ప్రాజెక్టు కార్యాలయాన్ని 100 మంది రైతులు ముట్టడించారు. పంపుహౌస్‌ల్లో మరమ్మతులు చేపట్టి సాగునీరు ఇవ్వాలని వేడారు. తమకు సాగునీరు అందించపోతే వలసలే శరణ్యమని వాపోయారు.

దుస్థితి ఇలా...

● గతేడాది మహారాష్ట్ర దొంగల ముఠా దుశ్చర్యతో ప్రాజెక్టు పరిధిలోని ఆరు ఎత్తిపోతల పథకాల పంపుహౌస్‌ల్లో విలువైన సామగ్రి చోరీకి గురైంది. సామగ్రి సైతం దేనికీ పనికిరాకుండా ద్వంసమైంది.

●మంత్రాలయం పరిధిలోని మూగలదొడ్డి స్టేజ్‌–1 పంపుహౌస్‌తో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి 1200 కేజీ కాపర్‌ను దొంగలించారు. పంప్‌హౌస్‌లో రూ.18 లక్షలు నష్టం వాటిల్లింది.

● మాధవరం స్టేజ్‌–1 పంపుహౌస్‌లో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు, మూడు స్టార్టర్లు, ఇన్సులేటర్‌, బ్రేకర్స్‌, బ్యాటరీలను నాశనం చేశారు. అందులో 9 కాపర్‌ షీట్లను ఎత్తుకెళ్లారు. కారణంగా రూ.1.46 కోట్లు నష్టం జరిగింది.

● బసలదొడ్డి స్టేజ్‌–1 పంపుహౌస్‌లోనూ స్టార్టర్‌, బ్యాటరీలు, ఫీడర్లను ధ్వంసం చేయగా రూ.12 లక్షలు నష్టం వాటినట్లు కేసు నమోదైంది.

● ఎమ్మిగనూరు పరిధిలోని సోగనూరు స్టేజ్‌–1 పంపుహౌస్‌లో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు, 1200 కేజీల కాపర్‌ను దొంగలించారు. పంప్‌హౌస్‌లో రూ.20 లక్షలు నష్టం జరిగింది.

● పూలచింత స్టేజ్‌–1, స్టేజ్‌–2 పంపుహౌస్‌లోనూ 4 ట్రాన్స్‌ఫార్మర్లు, కాపర్‌, ఆయిల్‌ ఎత్తుకెళ్లగా రూ.40 లక్షలు నష్టం వాటిల్లింది.

● చిలకలడోణ స్టేజ్‌–1, స్టేజ్‌–2 పంపుహౌస్‌లో 4 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి కాపర్‌, ఆయిన్‌ తీసుకెళ్లగా రూ.40 లక్షలు నష్టం జరిగిందని ప్రాజెక్టు అధికారుల అంచనా వేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు

ముందస్తు వర్షాలతో తుంగభద్ర నదిలో వరద నీరు పారుతూనే ఉంది. పంపుహౌస్‌ల మరమ్మతులు చేపట్టకపోవడంతో పథకాలన్నీ దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. నీరు ఎత్తిపోయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. మరమ్మతులు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదు. ఇటీవల ప్రభుత్వం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువలు, కేసీ కాలువ మైనర్‌ రిపేర్లకు నిధులు కేటాయించి గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు పైసా ఇవ్వక పోవడం దారుణం. జిల్లా పశ్చిమ ప్రాంత రైతులపై కూటమి ప్రభుత్వ కపట ప్రేమ తేటతెల్లమవుతోంది.

– గడ్డం నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ

రైతు సంఘం జిల్లా అధికార ప్రతినిధి

వెంటనే మరమ్మతులు చేపట్టాలి

పంపుహౌస్‌ల్లో జరిగిన చోరీలతో నిరుడు సాగునీరు అందించలేదు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. ఇలాగే వదిలేస్తే వేలాది ఎకరాలు బీళ్లుగా మారే ప్రమాదం ఉంది. రైతుల వలస బాట పట్టేలా ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే జలాశయాలకు నీటిని ఎత్తిపోయాలి. రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలి.

– రాముడు, సీపీఎం కోసిగి మండల కార్యదర్శి

వెలవెలబోతున్న బసలదొడ్డి జలాశయం

ఎమ్మిగనూరుటౌన్‌: రైతుల సంక్షేమం కోసం కాకుండా సాగునీటి ప్రా జెక్టుల విధ్వంసమే లక్ష్యంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం లక్ష్మినారాయణ రెడ్డి విమర్శించారు. ఇది పూర్తిగా రైతుల వ్యతిరేక ప్రభుత్వమని, ప్రతి చోటా అన్నదాతల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్‌జ బుట్టారేణుక ఆదేశాల మేరకు గురువారం రైతులతో ఆయన ర్యాలీగా వెళ్లి గురురాఘవేంద్ర ఎత్తిపోతల కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యాలయంలో సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారి లేకపోవడంతో ఖాళీ కుర్చికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయరంగాన్ని ప్రోత్సహిస్తూ సాగునీరందించేందుకు చర్యలు తీసుకొన్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్ట్‌ పనులు ముందుకు కదల్లేదన్నారు. పార్టీ నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడు చాంద్‌బాషా, నందవరం మండల ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు, సోంపురం గ్రామ సర్పంచ్‌ నరసింహులు, ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు శాంతిరాజు, చుక్కా మల్లేష్‌, కూలూరు శేషిరెడ్డి, ప్రకాష్‌రెడ్డి, వెంకటేష్‌ పాల్గొన్నారు.

గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద సాగు విస్తీర్ణం మండలాల వారీగా..

ప్రాజెక్టు స్వరూపం ఇదీ..

గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద మంత్రాలయం నియోజకవర్గంలో మూగలదొడ్డి, దుద్ది, మాధవరం, బసలదొడ్డి ఎత్తిపోతల పథకాలు నిర్మించారు.

2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సూగూరు జలాశయం నిర్మించి ప్రారంభించారు. అలాగే రూ.261.19 కోట్లతో పులికనుమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సోగనూరు, పూలచింత, చిలకలడోణ ఎత్తిపోతలు, కోడుమూరు నియోజకవర్గంలో ఏపీఎస్‌ఐడీసీ శాఖ పరిధిలో కృష్ణదొడ్డి, చింతమాన్‌పల్లె, రేమట, మునుగాల లిఫ్టు ఇరిగేషన్‌ పథకాలు నెలకొల్పారు.

తుంగభద్ర నది నుంచి 5.373 టీఎంసీల నీటిని జలాశయాలకు ఎత్తిపోసి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది.

ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం 1
1/4

ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం

ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం 2
2/4

ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం

ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం 3
3/4

ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం

ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం 4
4/4

ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement