
బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ప్రారంభం
నంద్యాల(అర్బన్): స్థానిక కేసీ కెనాల్ కాంపౌండ్‌లోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయ భవనంలో సోమవారం సాయంత్రం అత్యాధునిక వసతులతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ స్టోరేజ్ సెంటర్‌ను మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ప్రారంభించారు. రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హెండ్రీ డ్యూనంట్ చిత్రపటానికి మంత్రులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ మాట్లాడుతూ రక్తం దొరక్క ఏ ఒక్కరూ మరణించకూడదనే ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, గౌరవ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో రక్తం అవసరం ఉన్న వారికి సరైన సమయంలో అందించడానికి ఇతర జిల్లాలోని రక్తనిల్వ కేంద్రాల మీద ఆధార పడకుండా మన జిల్లాలోనే రక్త నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సంస్థ వారి సహకారంతో రక్త నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక సబ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రాము నాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, డీఈఓ జనార్దన్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జఫ్రుళ్ల్ల, సెట్కూర్ సీఈఓ డాక్టర్ వేణుగోపాల్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఖలందర్, రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పాల్గొన్నారు.