
బాలికల కోసం ‘కిశోరి వికాసం’
● జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు(సెంట్రల్): బాలికల కోసం ప్రభుత్వం కిశోరి వికాసం కార్యక్రమాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో కిశోరి వికాసం–వేసవి శిక్షణ కార్యక్రమల ప్రణాళిక పోస్టర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాలల హక్కుల చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. మే 2 నుంచి జూన్ 10 వరకు జరిగే కిశోరి వికాసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లా శిశు సంక్షేమ అధికారి నిర్మల, డీఎంహెచ్‌ఓ శాంతి కళ, డీసీపీఓ శారద, లీగల్ ఆఫీసర్ శ్రీలక్ష్మీ, సామాజిక కార్యకర్త నరసింహులు, కౌన్సిలర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
జిల్లాకు 13.50 లక్షల బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పత్తి సాగుకు 13.50 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటంతో పత్తి సాగు అధికంగా ఉంటోంది. వచ్చే ఖరీఫ్‌లో 2.45 లక్షల హెక్టార్లో పత్తి సాగయ్యే అకాశం ఉంది. హెక్టారుకు 450 గ్రాముల బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు ఐదు అవసరమవుతాయి. ఈ ప్రకారం జిల్లాకు 13.50 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లు అవసరం. వీటిని 11 కంపెనీలు సరఫరా చేస్తాయి. జిల్లాలో ప్రధానంగా బీటీ–2 పత్తి సాగు చేస్తారు. 450 గ్రాముల ప్యాకెట్ ధర రూ.901 ఉంది. బీటీ పత్తి ప్యాకెట్లకు ఎలాంటి సబ్సిడీలు ఉండవు. ఎంఆర్‌పీ ప్రకారం చూసినా రైతులు విత్తన ప్యాకెట్ల కోసమే రూ.122 కోట్లు ఖర్చు చేయనున్నారు. బ్రాండెడ్ కంపెనీల విత్తన ప్యాకెట్లను డీలర్లు బ్లాక్‌లో విక్రయించనున్నారు. జిల్లాలో బీటీ–2 విత్తన ప్యాకెట్లపైనే రైతులు రూ.200 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు.