సెల్‌ ఫోన్‌ హ్యాక్‌ చేసి.. రూ. 90 వేలు కాజేసి! | - | Sakshi
Sakshi News home page

సెల్‌ ఫోన్‌ హ్యాక్‌ చేసి.. రూ. 90 వేలు కాజేసి!

Mar 20 2025 1:55 AM | Updated on Mar 20 2025 1:49 AM

వెల్దుర్తి: సైబర్‌ నేరగాళ్లు రోజుకో పంథాలో దోచుకుంటున్నారు. సెల్‌ఫోన్‌ను హ్యాక్‌ చేసి, ఓటీపీలు తెలుసుకుని బ్యాంక్‌ ఖాతాలో ఉన్న నగదును అపహరించారు. వెల్దుర్తి పట్టణానికి చెందిన రేమడూరు రామిరెడ్డికి స్థానిక యూనియన్‌ బ్యాంకులో ఖాతా ఉంది. సైబర్‌ నేరగాళ్లు అతని సెల్‌ ఫోన్‌ను ఈనెల 17న హ్యాక్‌ చేసి ఓటీపీలు తెలుసుకుంటూ బ్యాంకు ఖాతాలోని రూ.99 వేలను అమేజాన్‌ పే ద్వారా బదిలీ చేసుకున్నారు. తన ఖాతా నుంచి నగదు మాయమైనట్లు గుర్తించిన బాధితుడు బుధవారం బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. సైబర్‌ నేరగాళ్ల పనేనని తెలుసుకుని తన ఖాతాను లాక్‌ చేయించారు. బాధితుడు సైబర్‌ పోలీసులు, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫోన్లకు వచ్చే కొత్త లింకులు ఓపెన్‌ చేయవద్దని, ఫోన్‌లు హ్యాక్‌ అయి నగదు మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎస్‌ఐ అశోక్‌ హెచ్చరించారు.

ప్రయాణికుల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టండి

ఆదోని సెంట్రల్‌: ప్రయాణికుల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రైల్వే సౌత్‌ సెంట్రల్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ రైల్వే అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా ఆయన బుధవారం సులహాళ్లి నుంచి గుంతకల్లు వరకు రైల్వే స్టేషన్లను పరిశీలిస్తూ ఆదోని రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. అమృత్‌ భారత్‌ పథకం కింద స్టేషన్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. ఈయన వెంట ప్రిన్సిపల్‌ చీఫ్‌ అప్రంటీస్‌ మేనేజర్‌ పద్మజ, గుంతకల్లు డీఅర్‌ఎం చంద్ర శేఖర్‌ గుప్త ఆదోని స్టేషన్‌ మాస్టర్‌ వెంకటేశ్వర్లు, చీఫ్‌ క్యాంప్‌ సూపరింటెండెంట్‌ త్రిభువన్‌, రైల్వే పోలీసులు తదితరులు ఉన్నారు. పట్టణంలోని నల్లగేటు వద్ద అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మా ణం చేపట్టాలని బీజేపీ నాయకులు నాగరాజు గౌడ్‌, మధుసూనద్‌ శర్మ తదితరులు అరుణ్‌ కుమార్‌ జైన్‌కు వినతి పత్రం అందజేశారు.

ఒద్దెల వాగులో

యువకుడి గల్లంతు

గాయాలతో బయటపడిన మరొకరు

పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యం–కొణిదేడు గ్రామాల మధ్య ఉన్న వొద్దెలవాగులో ఓ యువకుడు గల్లంతు కాగా మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. కొణిదేడు సమీపంలో రైల్వే డబ్లింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పనులు చేస్తున్న ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన రాహూల్‌, మరో యువకుడు పని మీద బుధవారం సాయంత్రం బైక్‌పై పాణ్యం వచ్చారు. రాత్రి పని ముగించుకుని పని చేసే చోటుకు తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఒద్దెలవాగులో పడిపోయారు. గమనించిన వాహనదారులు రాహుల్‌ అనే వ్యక్తికి బయటకు తీశారు. మరో యువకుడు గల్లంతైనట్లు తెలిపారు. సమాచారం తెలుసుకు న్న 108 సిబ్బంది గాయపడిన రాహుల్‌ను నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. స్థానికులు వాగు వెంట మరో యువకుడికి కోసం గాలిస్తున్నారు.

ట్రాక్టర్‌ డ్రైవర్‌ దుర్మరణం

డోన్‌ టౌన్‌: పట్టణంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. మల్లెంపల్లె గ్రామానికి చెందిన సలీంద్ర వీరాంజనేయులు (30) డోన్‌ పట్టణం నుంచి కొత్తపల్లె వైపు ట్రాక్టర్‌లో వెళ్తుండగా వెనుక వస్తున్న మరో ట్రాక్టరు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరాంజనేయులు ట్రాక్టర్‌ నుంచి ఎగిరి పక్కనే ఉన్న డివైడర్‌పై పడటంతో తలకు తీవ్రగాయమైంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య మంజుల, నెలల వయస్సు కుమారుడు ఉన్నారు.

సెల్‌ ఫోన్‌ హ్యాక్‌ చేసి.. రూ. 90 వేలు కాజేసి! 1
1/1

సెల్‌ ఫోన్‌ హ్యాక్‌ చేసి.. రూ. 90 వేలు కాజేసి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement