కర్నూలు(సెంట్రల్): మధ్యవర్తిత్వంతో కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు/జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధ్థి అన్నారు. సోమవారం జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులు, ఎన్‌జీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రితో కలసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రవేశపెట్టాలని తీర్మానించినట్లు చెప్పారు. అందులో భాగంగా ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు న్యాయవాదులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరరం కేరళ నుంచి వచ్చిన జ్యోతిగోపీనాథన్ మధ్యవర్తిత్వంపై శిక్షణనిచ్చారు.