కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మార్చి మొదటి పక్షంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. గురువారం కర్నూలులో 40.1 డిగ్రీలు, నంద్యాలలో 40.2 డిగ్రీలు నమోదు కావడం వేసవి తీవ్రతను స్పష్టం చేస్తోంది. 2024లో ఫిబ్రవరి చివరి నాటికే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎండలు, వడగాలుల నుంచి ఊరట కల్పించేందుకు కర్నూలులోని ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటయ్యాయి. చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు నిర్వహించారు. ఈ సారి గత ఏడాది కంటే ముందుగానే ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
కర్నూలులో 40.1, నంద్యాలలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు