కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలులోని లేపాక్షి హ్యాండిక్రాప్ట్ ఎంపోరియంలో ఈ నెల 31 వర కు క్లియరెన్స్ సేల్స్ జరుగుతాయని మేనేజర్ తిమ్మయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఎంపిక చేసిన వస్తువులపై 40 శాతం వరకు రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు థిమాటిక్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, ఉడ్ కార్వింగ్, దుర్గి స్టోన్ ఐటమ్స్, ఆళ్లగడ్డ రాతి చిత్రాలు, మదనపల్లి–టెర్రికోట మట్టి బొమ్మలతో ఐదు రోజుల పాటు ఎగ్జిబిషన్/ సేల్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అపురూపమైన చేతి వృత్తులకు మరింత ఆదరణ కల్పించాలనే లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉగాది పర్వదినం నేపథ్యంలో ఈ ఎగ్జిబిషన్‌కు ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాప్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చిందన్నారు.
విద్యుత్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
ఆదోనిఅర్బన్: వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆ శాఖ ఎస్‌ఈ ఉమాపతి ఆదేశించారు. శుక్రవారం స్థానిక డీఈ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫార్మర్ కావాలన్న వారికి వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. రైతులు కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. డివిజన్ పరిధిలో విద్యుత్ బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలన్నారు. అనంతరం కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. ఆదోని ఇన్‌చార్జి డీఈ రాజేష్, ఏడీఈ పురుషోత్తం, ఏఈ నాగభూషణం, డివిజన్ పరిధిలోని విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.
‘పది’ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి.శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రక టనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి 30వతేదీ వరకు జరగనున్న పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థి, విద్యార్థినులు ఒరిజినల్ హాల్ టికెట్ కండెక్టర్‌కు చూపిస్తే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారన్నారు. ఈ అవకాశం అన్ని పల్లెవెలుగు (ఆర్డినరీ) బస్సుల్లో ఉంటుందన్నారు. విద్యార్థులు ఉండే స్థానం నుంచి పరీక్ష కేంద్రం వరకు కేవలం పరీక్ష ఉన్న రోజు, సమయంలోనే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
కర్ణాటక మద్యం స్వాధీనం
కోసిగి: చిన్నభూంపల్లిలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కోసిగి, ఎమ్మిగనూరు సెబ్ సీఐలు మహబూబ్ బాషా, పి. శివకృష్ణమ్మ తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. చిన్నభూంపల్లి గ్రామంలో కోసిగి, ఎమ్మిగనూరు సెబ్ పోలీసులతో కలిసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. దాడులు నిర్వహిస్తుండగా గ్రామ శివారులో బైక్‌పై ఏడు బాక్స్‌లలో 672 టెట్రా ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకున్నామని, బైక్‌ను వదిలేసి గ్రామానికి చెందిన లక్ష్మయ్య పరారయ్యాడన్నారు. త్వరలో అతన్ని అరెస్ట్ చేస్తామని తెలిపారు.