
నినాదాలు చేస్తున్న వీఆర్‌పీఎస్ నేతలు
కర్నూలు(అర్బన్): వాల్మీకి/ బోయల ఎస్‌టీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలనే డిమాండ్‌పై వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్‌పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు ఎం సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో వాల్మీకి నేతలు ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ముందుగా స్థానిక జీజీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ వాల్మీకి/ బోయలకు ఎస్‌టీ రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారన్నారు. ముఖ్యమంత్రి పంపిన అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించి చట్టబద్ధం చేసేదాకా ఢిల్లీ కేంద్రంగా వీఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ కర్నూలులో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే వాల్మీకి, బోయలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించి తాను ఇచ్చిన హామీని మోదీ నిలబెట్టుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 4,5,6 తేదిల్లో ఢిల్లీలోనే ఉండి పలువురు పార్లమెంట్ సభ్యులను కలిసి బిల్లు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన వారిలో కప్పట్రాళ్ల మల్లికార్జున, మురళీనాయుడు, బోయ శ్రీరాములు, శ్రీనివాసులు, బోయమహేంద్ర, ఎం శివ, రాముడునాయుడు, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.