ఆ‘ధారం’ తెగుతోంది!
ఉమ్మడి జిల్లా చేనేత రంగం పరిస్థితి ఇలా ఉంది
జిల్లా జిల్లా
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేనేత రంగం ఒక వెలుగు వెలిగింది. జగన్ సర్కారు చేపట్టిన చర్యలతో చేనేతను వదిలేసిన వారు కూడా మళ్లీ మగ్గం తిప్పారు. చంద్రబాబు సర్కారు ఏర్పాటై 18 నెలలు గడచింది. ఈ కాలంలోనే రెండు జాతీయ చేనేత దినోత్సవాలు జరిగాయి. వీటికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత పరిశ్రమ అభివృద్ధికి, చేనేతకారుల సంక్షేమానికి ఎన్నో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి మాటలు విన్న చేనేతకారులు మురిసిపోయారు. నెలలు గడచిపోతున్నా.. ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చకపోవడంతో డీలాపడిపోతున్నారు. మరోసారి బాబు మాటలు నమ్మి మోసపోయామని తలలుపట్టుకుంటున్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి పాలనలో చేనేత పరిశ్రమ అభివృద్ధి పడకేసింది..చేనేతకారుల సంక్షేమం కొండెక్కింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా చేనేతలకు చేకూరిన లబ్ధి శూన్యం. 2014–19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అప్పట్లో కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. కొన్నింటికి జీవోలు కూడా జారీ చేశారు. కాని ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. మళ్లీ అలాంటి పరిస్థితులే నేడు ఉత్పన్నమవుతుండటంతో చేనేతకారులు మగ్గం వదిలేసే పరిస్థితి ఏర్పడింది.
టెక్స్‌టైల్ పార్క్‌ను వదిలేశారు
జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టెక్స్‌టైల్ పార్క్ నెలకొల్పాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. కాని అమలుకు నోచుకోవడం లేదు. ఈ ఏడాది ఆగస్టులో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు కోసం చేనేత, జౌళిశాఖల మంత్రి సవిత, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీభరత్ భూమి పూజ చేశారు. భూమి పూజ చేయడంతోనే టెక్స్‌టైల్ పార్క్ వచ్చేసిందని టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ నేతలు చేసిన హడావుడి అంతా, ఇంతా కాదు. అయితే ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇంతవరకు డీపీఆర్ కూడా సిద్ధం కాలేదు. టెక్స్‌టైల్ పార్క్ విషయంలో చంద్రబాబు సర్కార్ తీరును చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది.
ఉచిత విద్యుత్ వట్టిదే
ఉమ్మడి జిల్లాలో 4,705 కుటుంబాలు చేనేతపై ఆధారపడి ఉన్నాయి. 2024 ఎన్నికల సమయంలో చేనేతకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2024, 2025 సంవత్సరాల్లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో నెలకు చేనేత పరిశ్రమకు 200, పవర్ లూమ్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రకటించారు. కర్నూలు జిల్లాలో 2,457 చేనేత , ఒక పవర్ లూమ్, నంద్యాల జిల్లాలో 385 చేనేత, 73 పవర్ లూమ్స్‌కు ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం అధికార యంత్రాంగం ఏర్పట్లు కూడా చేసింది. కానీ ఉచిత విద్యుత్ హామీ 18 నెలలు గడచినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మాటలే తప్ప చేతలు లేవనే విషయం నేడు చేనేత కుటుంబాలకు అర్థమైంది.
ఆచరణలో కనిపించని
రూ.25 వేల సాయం
చెప్పింది చెప్పినట్లు చేయడం వైఎస్సార్‌సీపీ ఆధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకత. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన ఆయన చెప్పింది చెప్పినట్లు అమలు చేశారు. రెండేళ్లు కరోనాతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన్పటికీ ఎక్కడా రాజీపడలేదు. ఈ పథకం కింద చేనేత మగ్గాలను అభివృద్ధి చేసుకోవడం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించుకొని మరింత సమర్థవంతంగా రాణించేందుకు వైఎస్సార్ నేతన్న నేస్తం కింద నెలకు రూ.2000 ప్రకారం ఏడాదికి రూ.24,000 చెల్లించింది. దీంతో ఒక్కో చేనేత కుటుంబానికి ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఆర్థిక లబ్ధి చేకూరింది. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీ జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. చంద్రబాబు మాటలు విన్న చేనేతకారులు సంబరపడిపోయారు. నెలలు గడుస్తున్నా.. ఈ దిశగా చర్యలే లేకపోవడంతో నేడు ఉస్సు రు మంటున్నారు. చేనేతకార్మికుల ఆరోగ్య భద్రత కోసం బీమా పథకాన్ని అమలు చేస్తామని, చేనేతకు భారంగా మారిన జీఎస్టీని ఎత్తి వేస్తామని, ఇది సాధ్య కాకపోతే కట్టిన జీఎస్‌టీని వెనక్కు ఇస్తామని, చేనేత కార్మికులు ఇళ్ల నిర్మించుకుంటే మగ్గం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా మామూలుగా ఇచ్చే రూ.4.30 లక్షలకు అదనంగా రూ.50 వేలు చెల్లిస్తామని, కార్మికుల ఆదాయాన్ని పెంచేలా సమగ్ర పాలసీని తెస్తామని.. ఇలా అనేక హామీలు ఇచ్చారు. ఇంతవరకు వాటిలో ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో చేనేతలు మగ్గాలు వదిలేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో దాదాపు 674 కుటుంబాలు మగ్గాలను వదిలేసినట్లుగా తెలుస్తోంది.
దివాలా దిశగా ఆప్కో
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని చేనేత సహకార సంఘాల నుంచే కాకుండా రాష్ట్రంలోని అన్ని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసి మంగళగిరిలోని గోదాములో నిల్వ ఉంచుతుంది. అక్కడి నుంచి రాష్ట్రంలోని అన్ని షోరూములకు సరుకు సరఫరా అవుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేయడం గణనీయంగా తగ్గింది. ఉమ్మడి జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, శ్రీశైలంలలో ఆప్కో షోరూములు ఉన్నాయి. ఏడాది కాలంగా వాటికి కొత్తస్టాక్ సరఫరా కాలేదు. ఆప్కోలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు కూడా లేవు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆప్కో సిబ్బందికి వేతనాలు లేక అల్లాడుతున్నారు. ఆప్కో చరిత్రలో ఎప్పుడూ లేని పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆప్కో ఏమవుతుందోనన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
విషయం కర్నూలు నంద్యాల
చేనేత సహకార సంఘాలు 13 30
పని చేస్తున్న సంఘాలు 3 4
సభ్యులు 350 120
వ్యక్తిగత మగ్గాలపై ఆధార 3,398 837
పడిన కుటుంబాలు
మొత్తం చేనేత కుటుంబాలు 3748 957
కూటమి పాలనలో చేనేతలకు కష్టాలు
భూమి పూజకే పరిమితమైన
టెక్స్‌టైల్ పార్క్
అతీగతీలేని ఉచిత విద్యుత్,
ఏటా రూ.25 వేలు సాయం
18 నెలల్లో ఒక్క కుటుంబానికి
లబ్ధి కలిగితే ఒట్టు
సంక్షోభంలో కూరుకుపోయిన ఆప్కో


