గురజాడతో అభ్యుదయ సాహిత్యానికి బీజం
● అరసం జాతీయ అధ్యక్షుడు
పెనుగొండ లక్ష్మీనారాయణ
కర్నూలు కల్చరల్: తెలుగు సాహిత్యంలో అభ్యుదయ సాహిత్యం గురజాడతో ప్రారంభమైందని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. సాహిత్య అకాడమీ, అభ్యు దయ రచయితల సంఘం సంయుక్తంగా నగరంలోని సలాం ఖాన్ ఎస్టీయూ భవన్‌లో ఆదివారం 90 ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1933లో శ్రీశ్రీ రాసిన జయభేరి కవితతో తెలుగునాట అభ్యుదయ సాహిత్యం ప్రారంభమైందన్నారు. అనాటి నుంచి అభ్యుదయ సాహిత్య ఉద్యమం కొనసాగుతోందన్నారు. ఆరసం రాష్ట్ర అధ్యక్షుడు రాచపాళెం చంద్రశేశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యం, మార్క్సిజం తాత్విక దృక్పథంతో వర్గ సంఘర్షణలు ప్రతిబింబిస్తుందని, పీడిత, కర్షక, కార్మిక జీవితాలను చిత్రిస్తోందన్నారు. సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ రచయితలు సామాజిక దృష్టికోణం నుంచి రచనలు కొనసాగించినప్పుడే అవి సమాజంలో ఎక్కువ కాలం నిలబడతాయన్నారు. అరసం జిల్లా అధ్యక్షులు కె.ప్రహ్లాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ విమోచనోద్యమం – సాహిత్యం అనే అంశంపై ఎస్‌వీ సత్యనారాయణ, అభ్యుదయ సాహిత్య విమర్శ అంశంపై కరిమిండ్ల లావణ్య, అభ్యుదయ నవల అంశంపై కేపీ అశోక్‌కుమార్, అభ్యుదయ కథ అంశంపై ఎం.హరికిషన్, అభ్యుదయ నాటకం అంశంపై వి.వింధ్యావాహసినీ దేవి, అభ్యుదయ కవిత్వం అంశంపై కెంగార తాయప్పలు పత్ర సమర్పణలు చేశారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ తరపున చంద్రశేఖర రాజు, అరసం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకన్న, నగర ప్రధాన కార్యదర్శి ప్రమోద్ చక్రవర్తి పాల్గొన్నారు.


