ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలి
కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు యాప్‌ల భారాన్ని తగ్గించాలని పీఆర్‌టీయూ జిల్లా అద్యక్షులు ఎన్.వి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమప్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలపై ఎలాంటి స్పందన లేదన్నారు. పెండింగ్ డీఏలు చెల్లించాలని, కస్తూర్భా స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మినిమం టైం స్కూల్ అమలు చేయాలన్నారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవి ప్రకాష్, రాష్ట్ర కౌన్సిలర్ ఆదినారాయణ రెడ్డి, వీరారెడ్డి పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్‌లో ఈ నెల 22వ తేదీన డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్.ప్రదీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలను ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు 7382614308 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు. కాగా.. సోమవారం నిర్వహించాల్సిన డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లోతేటి శివశంకర్ తెలిపారు.
వైఎస్సార్సీపీ నాయకుడి గడ్డివామి దగ్ధం
వెల్దుర్తి: మండల పరిధిలోని బొమ్మిరెడ్డిపల్లెలో వైఎస్సార్సీపీ నాయకుడు, సర్పంచ్ భర్త మధుసూధన్ రెడ్డికి చెందిన గడ్డివామి ఆదివారం దగ్ధమైంది. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. బాఽధితుడైన మధుసూధన్ రెడ్డి ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు తమను అక్రమ కేసులో ఇరికించి ఎన్నో బాధలు పెడుతున్నారన్నారు. పొలాలు, ఇళ్లు వదిలి తాము వేరే చోట నివాసం ఉంటున్నామని, గడ్డివామికి ఎవరు నిప్పు పెట్టారు, ఎలా జరిగిందన్నది తనకు తెలియదన్నారు.
ప్రభుత్వం దృష్టికి గిరిజన ఉద్యోగుల సమస్యలు
కర్నూలు(అర్బన్): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పీ వెంకటప్ప చెప్పారు. ఆదివారం కర్నూలుకు వచ్చిన ఆయనను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డీ సురేష్ ఆధ్వర్యంలో ఆయా విద్యా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ సంక్షేమాధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయా విద్యా సంస్థల్లోని సమస్యలను పరిష్కరించాలని వారు వినతి పత్రాలను అందించారు.
ఆలూరు రూరల్: మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆలూరులో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే తనయుడు చంద్రశేఖర్ స్థానిక ఆర్‌అండ్ బీ అతిథి గృహంలో కేక్ కట్ చేయడానికి ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ ఇంచార్జ్ భర్త వైకుంఠం శివప్రసాద్ తన అనుచరులు 50 మందితో కలిసి అక్కడికి వచ్చారు. గుంతకల్లు చెక్‌పోస్టు నుంచి ర్యాలీగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో కలసి అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని వైఎస్సార్ పార్టీ కార్యాలయానికి మార్చుకున్నారు.
ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలి
ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలి


