
విశ్వకర్మ పూజల్లో పాల్గొన్న మేయర్ రామయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తదితరులు
● మేయర్ బీవైరామయ్య, ఎమ్మెల్యేలు కాటసాని,హఫీజ్‌ఖాన్ ● ప్రప్రథమంగా అధికారికంగా విశ్వకర్మ జయంతి వేడుకల నిర్వహణ ● ప్రత్యేక జీఓ జారీపై బీసీ సంఘాల హర్షం
కర్నూలు(సెంట్రల్): శ్రీవిరాట్ విశ్వకర్మ భగవాన్ ఆశయాలను నెరవేర్చుతామని కర్నూలు నగర మేయర్ బీవైరామయ్య, పాణ్యం, కర్నూలు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్ అన్నారు. ఆదివారం ప్రప్రథమంగా శ్రీవిరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతిని అధికారికంగా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ..సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మేలు చేసే వ్యక్తి అన్నారు. విశ్వకర్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా జరుపుకోవడానికి జీఓ నంబర్ 24ను విడుదల చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. దేవతల రూపాలను ప్రజలకు తెలిపిన వ్యక్తి విశ్వకర్మ అని, ఆయన జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాల్సి ఉందన్నారు. విశ్వకర్మ జయంతిని పండుగలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. విశ్వాన్ని సృష్టించిన ఇంజినీరు విశ్వకర్మ అని, ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ.. ఇప్పుడున్న ఆర్కిటెక్ అనేది గతంలోని కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, ఆచార్యుల నుంచి వచ్చిందన్నారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఆర్కిటెక్ ద్వారా ఎంతో అందమైన సామగ్రిని డిజైన్ చేసకుంటామని, ఆనాడు విశ్వకర్మ తన చేతితో అందమైన సామగ్రిని తయారు చేసి ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మద్దయ్య మాట్లాడుతూ..సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ఎందాకైనా వెళ్తున్నారని, ఆయనకు ఆయా వర్గాల ప్రజలకు అండగా నిలవాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో మధుసూదన్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థచైర్మన్ మద్దూరు సుభాస్ చంద్రబోస్, మార్కెట్ యార్డు చైర్మన్ ప్రభాకరరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మమ్మ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ సంక్షేమ రాష్ట్ర నాయకులు రామకృష్ణ, కటికె కార్పొరేషన్ డైరక్టర్ గౌతమ్, నాయకులు టీకే నారాయణాచారి, విజయచారి, రవికుమార్ ఆచారి పాల్గొన్నారు.