
అన్నదాతలు విత్తన పనులు మొదలు పెట్టారు. హొళగుంద మండలంలో గురువారం భారీ వర్షం కురవడంతో పొలాలు తడిసి ముద్దయ్యాయి. భూమి తడి ఆరకముందే ఎర్రరేగడి భూములున్న రైతులు పత్తి విత్తనం వేస్తున్నారు. హొళగుంద –ఆలూరు రోడ్డు సమీపంలోని పొలాల్లో శుక్రవారం విత్తనాలు పెడ్తున్న కూలీలు, గుంటుక పాస్తున్న రైతులు కనిపించారు. – హొళగుంద
జూనియర్ లెక్చరర్ల బదిలీలకు వెబ్ కౌన్సెలింగ్
కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న లెక్చరర్లను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం శనివారం రోపు బదిలీలకు దరఖాస్తు చేసుకుని, దరఖాస్తును ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు అందజేయాలి. ప్రిన్సిపాళ్లు ఇంటర్మీడియెట్ జిల్లా వృత్తి విద్యాధికారికి అందజేస్తే ఈ నెల 7వ తేదీలోపు సీనియారిటీ జాబితా తయారు చేయాలి. ఈ జాబితాలోని వారి నుంచి 13వ తేదీ లోపు అభ్యంతరాలు స్వీకరించి, అదే రోజు పరిష్కారం చేసిన 14న కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. బదిలీ అయిన వారు 15న కాలేజీలకు వెళ్లి రిపోర్ట్ చేసుకోవాలి. జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో మొత్తం 205 మంది జూనియర్ లెక్చరర్లు ఉన్నారు. జీరో సర్వీసు నిబంధన ఉండడంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే సాంకేతిక కారణాలతో ఆన్‌లైన్ దరఖాస్తుల లింక్ శుక్రవారం ఓపెన్ కాలేదు.