కానిస్టేబుల్‌ మృతి

మృతిచెందిన జానీబాషా  - Sakshi

కర్నూలు : రైల్వే విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ అన్వర్‌ బాషా (35) కిడ్నీ వ్యాధితో కర్నూలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన అన్వర్‌ బాషా 2013లో కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరి వివిధ పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహించాడు. గత కొంతకాలంగా కిడ్నీ జబ్బుతో బాధ పడుతుండగా ఇటీవల కర్నూలులోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించగా కోలుకోలేక మృతిచెందాడు. ఈయనకు భార్యతో పాటు కుమారుడు సంతానం. ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉంది. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని ఎమ్మిగనూరుకు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి దుర్మరణం

గోనెగండ్ల: రోడ్డు ప్రమాదంలో జానీ బాషా(23) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఎస్‌ లింగందిన్నె గ్రామం క్రాస్‌ రోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపిన వివరాల మేరకు కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన జానీబాషా తన సొంత పనుల నిమిత్తం బుధవారం ద్విచక్ర వాహనంపై పత్తికొండకు వెళ్లాడు. రాత్రి పనులు ముగించుకొని తిరిగి పులకుర్తి గ్రామానికి బయాలుదేరాడు. ఎస్‌ లింగందిన్నె గ్రామం క్రాస్‌ రోడ్డు సమీపంలోకి రాగానే కర్నూలు నుంచి పత్తికొండకు వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో బైక్‌పై వెళ్తున్న జానీబాషా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య చాందిని, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అన్నదమ్ముల మధ్య ఘర్షణ

మంత్రాలయం రూరల్‌: భూ వివాదంతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రచ్చమర్రి గ్రామానికి చెందిన ఈడిగ బొడ్డయ్య కుమారులైన పెద్ద ఈరప్పకు చిన్న ఈరప్ప, నరసింహులు మధ్య భూవివాదం ఉంది. ఈ క్రమంలో గురువారం పెద్ద ఈరప్పపై చిన్న ఈరప్ప దాడి చేశాడు. గాయపడిన పెద్ద ఈరప్పను చూసిన వారి కుటుంబ సభ్యులు వెంటనే చిన్న ఈరప్పపై వేట కొడవళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐలు వేణుగోపాల్‌రాజు, కిరణ్‌ గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top