కలుపు మొక్కే కల్పతరువు | - | Sakshi
Sakshi News home page

కలుపు మొక్కే కల్పతరువు

Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM

ఎండిన గుర్రపు డెక్కతో ఇంటీరియర్‌ డిజైన్ల తయారీ బుట్టలు, మ్యాట్‌ల తయారీలో డ్వాక్రా మహిళలకు శిక్షణ చేవేండ్ర, లేళ్లగూడెంలో నడుస్తున్న శిక్షణ కేంద్రాలు

అలంకరణ సామగ్రి తయారీ ఇలా..

పెడన: గుర్రపు డెక్క ఓ కలుపు మొక్క. పంట కాలువలు, మురుగు కాలువల్లో దట్టంగా అల్లుకు పోయి నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది. దీని వల్ల ఇబ్బందులు తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. అటువంటి కలుపు మొక్కతో అద్భుతమై కళాకృతులు చేయొచ్చని, వాటిపై డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇస్తే ఆర్థికంగా ఎదుగుతారని అధికారులు భావించారు. బందరు మండలం చిన్నాపురం డ్వాక్రా మహిళలకు అసోం నుంచి వచ్చిన వారితో శిక్షణ ఇప్పించారు. వారు గుర్రపుడెక్కతో తయారు చేసిన బట్టలు, యోగా మ్యాట్‌లు, డిన్నర్‌ సెట్‌ మ్యాట్‌లు, టోపీలు, పలు అలంకరణ సామగ్రిని చూసి పలువురు మహిళలు అబ్బురపడ్డారు. తాము కూడా శిక్షణ పొంది పలు రకాల అలంకరణ సామగ్రిని తయారుచేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం పెడన మండలం చేవేండ్ర గ్రామం, బంటుమిల్లి మండలం మణిమేశ్వరం పంచా యతీ లేళ్లగూడెం గ్రామంలో డ్వాక్రా మహిళలు గుర్రపు డెక్కతో అలంకరణ సామగ్రి తయారీలో శిక్షణ పొందుతున్నారు.

రెండు నెలల శిక్షణ

ప్రస్తుతం చేవేండ్ర గ్రామంలో సుమారు 26 మంది శిక్షణ పొందుతున్నారు. లేళ్లగూడెంలో కూడా శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. శిక్షణకు హాజరవుతున్న మహిళలకు రోజుకు రూ.300 చొప్పున ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. శిక్షణ పొందిన మహిళలు ఒక్కొక్కరు రోజుకు రెండు లేదా మూడు డైనింగ్‌ టేబుల్‌పై వాడే డిన్నర్‌ మ్యాట్‌లు తయారు చేస్తున్నారు. యోగా మ్యాట్‌ రోజుకు ఒకటి పూర్తి చేస్తున్నారు. రకాన్ని బట్టి బుట్టకు రెండు లేదా మూడు రోజుల సమయం పడుతోంది. శిక్షణ పొందిన మహిళలతో సొసైటీ ప్రారంభించి చిన్నపాటి కుటీర పరిశ్రమను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. పెడనకు చెందిన కలంకారీ వ్యాపారి, లేపాక్షి కో ఆర్డినేటర్‌ జంపాన శ్రీనివాస్‌ డ్వాక్రా మహిళలు శిక్షణ పొందేలా ప్రోత్సహిస్తున్నారు.

పంట కాలువలు, మురుగు నీటి కాలువలు, చెరువుల్లో పెరిగిన గుర్రపు డెక్కను సేకరిస్తారు. ఆ డెక్కను ఎండబెట్టి నారను తయారు చేస్తారు. దీనితో వివిధ రకాల వస్తువులను తయారు చేస్తారు. ప్రస్తుతం ఎండబెట్టిన గుర్రపు డెక్క కిలో ధర రూ.70 వరకు పలుకుతోంది. గుర్రపు డెక్క నారతో యోగా మ్యాట్‌లు, డిన్నర్‌ సెట్‌ మ్యాట్‌లు, పూజా సామగ్రిని తీసుకెళ్లే బుట్టలు, ఇంటిలో అలంకరణకు వాడుకునే పూల బుట్టలు, వివిధ శుభకార్యాల్లో అతిథులకు ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇచ్చేందుకు వివిధ రకాల వస్తువులను తయారు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement