విజయవాడ కల్చరల్: కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్య సంప్రదాయాలను మేళవిస్తూ ఘంట సాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో రెండు రోజులుగా నిర్వహించిన ప్రపంచ నృత్య దినోత్సవాలు బుధవారం ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, అమరావతి శాసీ్త్రయ నాట్యాచార్యుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో నగరానికి చెందిన రెండు వందల మందికి పైగా చిన్నారులు పాల్గొని నట రాజ స్వామికి నృత్యాభిషేకం సమర్పించారు. శివస్తుతి, దశావతారాలు, గరుడ గమన, రారా మా ఇంటికి కృష్ణయ్య, అష్టలక్ష్మి నృత్యం, తరంగం, థిల్లానా, కొండలలో నెలకొన్న, అఖిలాండ కోటి, అయిగిరి నందిని, తదితర కీర్తనలకు నృత్యాలను అభినయించారు. ముఖ్య అతిథి, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ సి.జ్యోతిర్మయి మాట్లాడుతూ.. భారతీయ నృత్య సంప్రదాయాలు విశిష్టమైనవన్నారు. అమరావతి నాట్యాచార్యుల బృందాన్ని అభినందించారు. కూచిపూడి కళానికేతన్ వ్యవస్థాపకుడు వేదాంతం వెంకటనాగ చలపతి పాల్గొన్నారు. నృత్య కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు. కూచిపూడి నాట్య సంప్రదాయానికి కృషి చేస్తున్న నాట్యాచార్యుడు ఏలేశ్వరపు శ్రీనివాస్, వాద్య సహకారం అందిస్తున్న పాలపర్తి ఆంజనేయులు, రాగ నిపుణుడు చల్లారావును నిర్వాహ కులు సత్కరించారు. నాట్యాచార్యులు డాక్టర్ వేదాంతం పార్థసారథి, డాక్టర్ చింతా రవిబాలకృష్ణ, పద్మశ్రీ హేమంత్, యల్లా జోస్యల అనూరాధ,భాగవతుల సౌమ్య, భాగవతుల వెంకట్రామ శర్మ, జోస్యుల శ్రీరామచంద్రమూర్తి, శారద రామకృష్ణ, ఉమామహేశ్వర పాత్రుడు, చదలవాడ ఆనంద్, రాయన శ్రీనివాసరావు, ఉషా మాధవి, దేవరకొండ చంద్రశేఖర్, సీహెచ్ అజయ్‌కుమార్, సప్పా శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


