● ఆశగా ఎదురుచూస్తున్న నిరుపేదలు ● డబ్బులు చెల్లించినా మంజూరు కాని ఇళ్లు ● పట్టించుకోని ప్రజాప్రతినిధులు
తిరువూరు: సొంతిల్లు లేని పేద కుటుంబాలకు 2017లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. తిరువూరు పట్టణంలోని 1,536 మంది లబ్ధిదారులకు నేటికీ ఇళ్లు పంపిణీ జరగలేదు. మూడు కేటగిరీలలో నిర్మించే ఈ ఇళ్లకు పలువురు లబ్ధిదారులు తమ వాటా సొమ్ము కూడా చెల్లించినా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేదు. కేటగిరీ–1లో 300 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు, కేటగిరీ–2లో 365 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు, కేటగిరీ–3లో 430 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లను నిర్మించాలి. కేటగిరీ–1 ఇళ్లకు రూ.5.72 లక్షలు యూనిట్ ధర కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.1.50 లక్షల చొప్పున నిర్మాణ వ్యయం భరిస్తుండగా, మిగిలిన రూ.2.71 లక్షలను బ్యాంకు ద్వారా రుణం తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. ఈ కేటగిరీ ఇళ్లకు లబ్ధిదారు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. కేటగిరీ–2లో యూనిట్ నిర్మాణ వ్యయం రూ.6.74 లక్షలు. రూ.50 వేలను లబ్ధిదారు వాటాగా నాలుగు విడతల్లో చెల్లించాలి. కేటగిరీ–3 ఇళ్లకు లబ్ధిదారులు నాలుగు విడతలుగా రూ.లక్ష చెల్లించే అవకాశం కల్పించారు.
అయితే, కేటగిరీ 2, 3 ఇళ్లకు లబ్థిదారులు వాటా సొమ్ము చెల్లించినా డిమాండ్‌కు సరిపడా ప్లాట్ల నిర్మాణం చేపట్టకపోగా, వారికి మంజూరు చేసిన యూనిట్లను రద్దు చేసినట్లు అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే వారు చెల్లించిన సొమ్ము మాత్రం ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు.
నత్తనడకన నిర్మాణ పనులు
తాము అధికారంలోకొస్తే వెంటనే టిడ్కో ఇళ్ల పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలునేటికీ నెరవేరలేదు. ఉగాది పండుగకే ఈ ఇళ్లను పంపిణీ చేస్తామని పదే పదే అధికారులు ప్రకటనలు గుప్పించారు. అయితే పనులు పూర్తికాకపోవడంతో ఇప్పట్లో టిడ్కో ఇళ్ల సముదాయంలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసే అవకాశం కనిపించడం లేదు.


