దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ, అన్నదానం, గోసంరక్షణకు భక్తులు విరివిగా విరాళాలు అందించారు. విజయవాడ మధురానగర్‌కు చెందిన డి.శ్రీనివాస ప్రసాద్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి ఉచిత ప్రసాద వితరణకు రూ.లక్ష విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయ్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
అన్నదానానికి రూ.లక్ష విరాళం
అమ్మవారి అన్నప్రసాద వితరణకు చైన్నెకు చెందిన ఎం.బాబ్జి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారికి అందజేశారు. విజయవాడ ఇస్లాంపేటకు చెందిన కె.వి.మోహనరావు దంపతులు దుర్గమ్మ గోసంరక్షణ పథకానికి రూ.1,00,005 విరాళాన్ని ఆలయ అధికారికి అందజేశారు. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించి, వేద ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.


