అంకిత భావంతో విధులు నిర్వర్తించాలి
కోనేరుసెంటర్: పోలీసు శిక్షణకు వెళుతున్న అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం విధి నిర్వహణను అంకితభావంతో నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండా లని జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు తెలిపారు. జిల్లాలో ఇటీవల పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికై న అభ్యర్థులు విజయనగరం, శ్రీకాకుళం పోలీసుశిక్షణ కేంద్రాల్లో తొమ్మిది నెలల పాటు నిర్వహించనున్న శిక్షణకు శనివారం తరలివెళ్లారు. ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ నాయుడు అభ్యర్థులను అభినందించి శిక్షణకు పంపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా అభ్యర్థులు శిక్షణలో అన్ని మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. చట్టాలపై శిక్షణలో పూర్తిగా అవగాహన పెంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, బందరు డీఎస్పీ సీహెచ్ రాజా, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


