దుర్గమ్మ సన్నిధిలో క్యూలైన్లు కిటకిట
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు భక్తుల రద్దీ ఓ మోస్తరుగా కనిపించింది. వర్షాలు కురుస్తాయని ముందుగా హెచ్చరించడంతో ఆ ప్రభావం కొంత భక్తులపై పడింది. అయితే ఉదయం నుంచి వాతావరణం పొడిగా, ఎండగా ఉండటంతో క్రమేపీ రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అరగంట పాటు అన్ని క్యూలైన్లు నిలిపివేశారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించిన అనంతరం మధ్యాహ్నం తిరిగి దర్శనాలు ప్రారంభమయ్యాయి. అయితే అప్పటికే అన్ని క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఘాట్‌రోడ్డులో ఓం టర్నింగ్‌లోని స్టీల్‌గేట్ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉండగా, ఇటు మహా మండపం మెట్ల మార్గంలోని క్యూలైన్ నాల్గో అంతస్తు వరకు చేరింది. దీంతో ఆలయ అధికారులు అప్రమత్తమై భక్తులకు త్వరతిగతిన అయ్యేలా చర్యలు తీసుకున్నారు. క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా త్వరగా ముందుకు జరిగేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సర్వ దర్శనం క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టిగా, రూ. 300, రూ. 100 టికెటు క్యూలైన్‌లో గంట సమయం పట్టింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలోనూ పలువురు భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
సర్వ దర్శనానికి రెండు గంటలు


