వరద ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపునకు పునరావాస కేంద్రాల ఏర్పాటు ఎగువ ప్రాంతాల్లో నిండుకుండల్లా చెరువులు వెలగలేరు హెడ్‌రెగ్యులేటర్ వద్ద బుడమేరును పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ
కలెక్టర్ బుడమేరు పరిశీలన
జి.కొండూరు: బుడమేరు పేరు చెప్తేనే ఉలిక్కిపడేలా జల ప్రళయాన్ని సృష్టించిన ఘటన మరవక ముందే మోంథా తుఫాన్ రూపంలో వస్తున్న మరో ఉప్పెన లోతట్టు ప్రాంతాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. బుడమేరు ఎగువ ప్రాంతాల్లో చెరువులు ఇప్పటికే నిండిపోయి నిండుకుండల్లా దర్శనమిస్తున్న క్రమంలో ఏ మాత్రం భారీ వర్షం కురిసినా బుడమేరుకు వరద పోటెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. వరద పెరిగితే వెంటనే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరద వచ్చే అవకాశం ఉండడంతో ఉరుకులు పరుగులు పెడుతున్న ప్రభుత్వ యంత్రాంగం వరదలొచ్చిపోయి ఏడాది గడిచినా బుడమేరు ప్రక్షాళన చేయడంలో మాత్రం విఫలమైంది. ఒక వేళ మోంథా తుఫాన్‌తో బుడమేరుకు వరద పోటెత్తితే ఎన్టీఆర్ జిల్లాలో రైతులు, పేద ప్రజలకు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది.
గతేడాది అసలేం జరిగింది
గతేడాది ఆగస్టు 30వ తేదీన శుక్రవారం మెల్లగా మొదలైన వర్షం ఆ రాత్రి భారీ వర్షంగా మారింది. దీంతో ఆగస్టు 31వ తేదీన ఉదయానికల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండవాగు, కోతులవాగు, కళింగవాగు, కోవ వాగు, పులివాగు, వెంకటాపురం వాగు, దొర్లింతాల వాగు, కప్పలవాగు, తొమ్మండ్రం వాగులతో పాటు పలు వాగులు పొంగిపొర్లాయి. ఒక్కసారిగా ఊహించని వరద ఉప్పొంగడంతో నియోజకవర్గంలో 34 చెరువులకు గండ్లు పడ్డాయి. ఏ.కొండూరు మండలంలో బుడమేరు పుట్టిన ప్రదేశం నుంచి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వరకు 42 కిలోమీటర్ల పరిధిలో చిన్న, పెద్దవి కలిపి 80కి పైగా గండ్లు పడ్డాయి. అదేవిధంగా ఈ వరద ప్రవాహానికి వెలగలేరు హెడ్‌రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్లు మేర ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు కుడి వైపు ఏడు గండ్లు, ఎడమ వైపున మూడు గండ్లు పడ్డాయి. ఈ వరద ప్రవాహానికి మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మండలాలు ముంపునకు గురయ్యాయి. అయితే అదేరోజు సాయంత్రానికి వెలగలేరు హెడ్‌రెగ్యులేటర్ వద్దకు 30 వేల క్యూసెక్కులకుపైగా వరద నీరు చేరి అధికారులు 11 గేట్లను ఎత్తడంతో తర్వాతి రోజు సెప్టెంబర్ ఒకటో తేదీన ఉదయానికి విజయవాడ రూరల్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. కృష్ణానదికి కూడా వరద ప్రవాహం పెరగడంతో ఇబ్రహీంపట్నం పూర్తిగా ముంపునకు గురైంది. ఈ వరద ప్రభావంతో అటు విజయవాడ, ఇటు మైలవరం నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. యాభై మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా మూగజీవాలు సైతం మృత్యువాత పడ్డాయి. ఇప్పుడు మళ్లీ మోంథా తుఫాన్ ప్రభావంతో బుడమేరుకు వరద పోటెత్తడంతో పాటు ఎగువన చెరువులు కూడా నిండి ఉండడంతో బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
ఆ మూడు గ్రామాలకు ప్రమాదం
బుడమేరుకు వరద ప్రవాహం ఎక్కువైతే జి.కొండూరు మండల పరిధి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్దకు భారీగా వరద చేరుతుంది. హెడ్‌రెగ్యులేటర్ లాకులు ఎత్తితే విజయవాడ మునిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు సాధ్యమైనంత వరకు డైవర్షన్ కెనాల్‌గుండా కృష్ణా నదికే వరద మళ్లిస్తారు. ఈ క్రమంలో హెడ్‌రెగ్యులేటర్ వద్ద భారీగా వరద నిల్వ ఉంటుంది. ఈ సమయంలో బుడమేరు కాల్వకు ఎడమ వైపు గండ్లు పడితే దిగువన ఉన్న వెలగలేరు, కవులూరు గ్రామాలు, కుడి వైపు గండ్లు పడితే ముత్యాలంపాడు గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. 11,823 మంది జనాభా ఉండే ఈ మూడు గ్రామాల్లో ఇటీవల వచ్చిన వరద ప్రవాహానికి తీరని నష్టం వాటిల్లింది.
మోంథా తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సోమవారం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద బుడమేరును పరిశీలించారు. ఎగువ నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు 24/7 ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ఉధృతి పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులను అప్రమత్తం చేయాలని బుడమేరు పరిశీలనా అధికారులకు సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 189 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
తుఫాన్‌తో బుడమేరుకు వరద ముంపు !


