ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు
లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి తుపాను పర్యవేక్షణ జోనల్ ప్రత్యేకాధికారి ఆర్‌పీ సిసోడియా
చిలకలపూడి(మచిలీపట్నం): మోంథా తుపాను కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తుపాను పర్యవేక్షణ జోనల్ ప్రత్యేకాధికారి, చేనేత, జౌళిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, జేసీ నవీన్‌లతో కలిసి తుపాను ప్రభావంపై తీసుకున్న చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్ధంగా పనిచేయాలన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందుగానే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, డయాలసిస్ పేషంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. మూడు రోజులు ప్రజలందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండేలా అప్రమత్తం చేయాలన్నారు. ముందుగానే నిత్యవసర సరుకులు నిల్వ చేసుకోవాలని, ఇతర సామగ్రిని కూడా సిద్ధంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పట్టణ ప్రాంతాల్లో రహదారులు, డివైడర్లపై ఉన్న హోర్డింగ్‌లు వెంటనే తొలగించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ల సిగ్నల్స్ సమస్య వస్తుందని దీనిని అధిగమించేందుకు శాటిలైట్ ఫోన్లను వినియోగించాలన్నారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, ఆర్డీవో కె.స్వాతి, ఇరిగేషన్ ఎస్‌ఈ మోహనరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సోమశేఖర్, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేశ్వరరావు తదితరులు ఉన్నారు.


