
జెడ్పీ చైర్ పర్సన్ దంపతులకు బైరెడ్డి పరామర్శ
పెడన: ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పాల రాము దంపతులను శాప్ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి పరామర్శించారు. బుధవారం రాత్రి 7 గంటలకు కృష్ణా జిల్లా పెడన మండలం కృష్ణాపురం గ్రామంలోని రాము నివాసానికి చేరుకున్న ఆయన వారితో మాట్లాడారు. ఈ నెల 12న గుడివాడలో టీడీపీ, జనసేన పార్టీకు చెందిన గూండాలు దాడి చేసిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు జరిగిన సంఘటనల వీడియోలను చూసిన ఆయన క్యాబినెట్ ర్యాంకు మహిళపై అమానుషంగా దాడి చేస్తున్న వారిని నిలువరించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. ఇటువంటి దాడులను సహించేది లేదని, ప్రభుత్వం తక్షణం స్పందించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈయనతో పాటు వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఇతర నాయకులున్నారు. బైరెడ్డి పెడన వస్తున్నారని తెలిసి వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్ సీపీ యువజన విభాగం కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.