
వేమిరెడ్డిపల్లి తండాలో జ్వరాల విజృంభణ
వేమిరెడ్డిపల్లి(విస్సన్నపేట): మండలంలోని వేమిరెడ్డిపల్లి తండాలో జ్వరాలు విజృంభించాయి. ఇంటికి ఒక్కరు, ఇద్దరు చొప్పున జ్వరాల బారిన పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షాలకు నీరు ఇళ్ల ముందే నిల్వ ఉండి దోమలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి జ్వరాలు రావడంతో తిరువూరులో ప్రైవేటు హాస్పిటల్‌లో వైద్యం పొందుతున్నామని, కొంతమందికి టైఫాయిడ్, మరికొంత మందికి కాళ్లు నొప్పులతో జ్వరాలు వస్తున్నాయన్నారు.
డీఎంహెచ్‌ఓ పరిశీలన..
డీఎంఅండ్‌హెచ్‌ఓ సుహాసిని బుధవారం వేమిరెడ్డి పల్లి తండాను సందర్శించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు. జ్వరాలతో ఇబ్బంది పడుతున్న వారి ఇంటికి వెళ్లి పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాచివడపోసిన నీరు తాగాలన్నారు. వైద్యశిబిరంలో జ్వరాలతో బాధపడేవారిని పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంఓ మోతీబాబు, ఎస్‌హెచ్‌ఓ బాబావలి, మండల వైద్యాధికారి శ్రీనివాసరావు, డాక్టర్ అశ్వినీదత్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.