
పారాహుషార్!
విజయవాడకు పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
వ్యాధుల కాలం.. అప్రమత్తతేదీ?
వర్షాకాలంలో దోమకాటు వ్యాధులైన మలేరియా, డెంగీ వంటి జ్వరాలతో పాటు, కలుషిత ఆహారం, నీరు కారణంగా టైఫాయిడ్, డయేరియా, వైరస్ కారణంగా కామెర్లు సోకే అవకాశం ఉంది. ఆయా వ్యాధులు సోకకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ వైద్య ఆరోగ్యశాఖ ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహిస్తోంది. కానీ ఇప్పుడు పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఎక్కడ మురుగు అక్కడే ఉంటోంది. చెత్తను తరలించే వారే లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ఎక్కడ ప్రభలుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంకా మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాధులు తప్పవని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): స్వచ్ఛ నగరంగా పేరుగాంచిన విజయవాడలో ఎక్కడ చూసినా చెత్త పేరుకు పోయింది. సైడు కాలువల్లో పూడిక తీసేవాళ్లు లేక, నీరు పారుదల కాక, చిన్న వర్షానికే రోడ్డుపైకి మురుగు చేరుతోంది. రోడ్లపై నిలిచిన నీటితో చెత్త వ్యర్థాలు తేలియాడుతున్నాయి. అసలే వర్షా కాలం ప్రారంభమై, రోజూ ఏదో సమయంలో వర్షం కురుస్తుండగా, చెత్త, వ్యర్థాలు తరలించే వాళ్లు లేక ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోవడంతో వ్యాధి కారక బ్యాక్టీరియాలు, దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
సమ్మెలో కార్మికులు..
విజయవాడలో శానిటేషన్ పనులు చూసే కార్మికులు రెండు వారాల నుంచి సమ్మెలో ఉన్నారు. దీంతో నగర వ్యాప్తంగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకు పోతోంది. తాత్కాలిక సిబ్బందితో కొన్ని ప్రాంతాల్లో చెత్తను తొలగించినా అన్ని ప్రాంతాల్లో తరలించలేక పోతున్నారు. దీంతో ఫుడ్‌స్టాల్స్, హోటళ్లు ఉన్న ప్రాంతాల్లో డంపర్‌బిన్ నిండి, వాటి చుట్టూ వ్యర్థాలు గుట్టలుగా పడి ఉంటు న్నాయి. వర్షానికి అవి తడిసి, నీటిలో కలిసి అంతా ప్రవహిస్తూ అపరిశుభ్రం చేస్తున్నాయి. నగరంలో ఏ రోడ్డులోకి వెళ్లినా ఇదే పరిస్థితి నెలకొంటోంది. అలాంటి అపరిశుభ్ర వాతావరణంతో ఈగల ద్వారా అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
మురుగు సమస్య ఎక్కువే..
పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో డ్రెయిన్‌లలోని వ్యర్థాలు తొలగించే కార్యక్రమం నిలిచిపోయింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో డ్రెయిన్‌లు పూడిపోయి వర్షం నీరు కూడా పారుదల కాని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా బెంజిసర్కిల్‌లో మోకాళ్లలోతు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో డ్రెయిన్‌లలో మురుగు రోడ్డుపై ప్రవహించడంతో రోడ్లపై మురుగు పేరుకుపోయింది.
నగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఇబ్బందులు సైడ్ కాలువల్లో సిల్ట్ తీసే వారూ కరువు సీజనల్ వ్యాధులపై కొరవడిన అధికారుల అప్రమత్తత ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు
మత్తు వీడని ప్రభుత్వం..
నగరంలో శానిటేషన్ కార్మికులు రెండు వారాల నుంచి సమ్మెలో ఉంటే ప్రభుత్వం మాత్రం మత్తు వీడటం లేదు. దీంతో నగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. డ్రెయిన్‌లు పూడిక తీత లేక చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి.
– డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం

పారాహుషార్!