
దుర్గమ్మకు రూ.6లక్షలతో బంగారు గొలుసు, సూత్రాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు రూ.6లక్షల విలువైన బంగారపు గొలుసు, రెండు మంగళ సూత్రాలను కానుకగా సమర్పించారు. విజయ వాడ రామలింగేశ్వరపేటకు చెందిన జంధ్యాల కుమార స్వామి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు సోమవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి సుమారు 61గ్రాముల బంగారంతో తయారు చేసిన గొలుసు, రెండు మంగళ సూత్రాలను అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
రేపు ఐటీఐ కౌన్సెలింగ్
గుడివాడ టౌన్: కృష్ణాజిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో రెండో విడత చేరికలకు కౌన్సెలింగ్ ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఓ. మంజులాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు విడతల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్‌లు తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు 9346118232, 8143653907లో సంప్రదించాలని కోరారు.
గ్రామాల్లో మౌలిక వసతులపై పరిశీలన
ఉయ్యూరు రూరల్: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ పరిశీలన బృందం ప్రతినిధులు ఉయ్యూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని కాటూరు, బోళ్లపాడు, ముదునూరు గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను నిశితంగా పరిశీలించారు. ప్రజల నుంచి గ్రామస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న మౌలిక వసతులపై ఆరా తీశారు. హెల్త్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, రహదారులు, డ్రెయినేజీలతో పాటు తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా విభాగాలను పరిశీలించారు. పంచాయతీ కార్యాలయాల్లో రికార్డులను తనిఖీ చేశారు. కాటూరులో గుడివాడ డీఎల్పీఓ, ఉయ్యూరు ఎంపీడీవో శేషగిరిరావు, డెప్యూటీ ఎంపీడీవో ఏఎస్‌ఆర్ కోటేశ్వరావు పాల్గొని బృంద ప్రతినిధులకు పలు అంశాలపై వివరించారు.
ఇద్దరు రైల్వే ఉద్యోగులకు జీఎం సేఫ్టీ అవార్డులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్ల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ చేతుల మీదుగా ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డు’ అందుకున్నారు. సోమవారం జోనల్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌తో పాటుగా సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్‌ల డీఆర్‌ఎంలతో వర్చువల్ పద్ధతిలో జీఎం భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రమం తప్పకుండా అన్ని సెక్షన్‌లలో సేఫ్టీ డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం విజయవాడ డివిజన్‌లో విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన సామర్లకోటలోని టీటీఐ డీవీకేఎస్‌పీ చైతన్య, రాజమండ్రిలోని ట్రైన్ మేనేజర్ కె.పాపారావుకు జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అవార్డులను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అవార్డులు సాధించిన డివిజన్ సిబ్బందిని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.

దుర్గమ్మకు రూ.6లక్షలతో బంగారు గొలుసు, సూత్రాలు

దుర్గమ్మకు రూ.6లక్షలతో బంగారు గొలుసు, సూత్రాలు

దుర్గమ్మకు రూ.6లక్షలతో బంగారు గొలుసు, సూత్రాలు