
సకాలంలో అర్జీలను పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): మీకోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ బి. శ్రీదేవి, హౌసింగ్ ఇన్‌చార్జ్ పీడీ పోతురాజు, ఏఎస్పీ సత్యనారాయణ, మెప్మా పీడీ సాయిబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ‘మీ కోసం’ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వాటిని సకాలంలో పరిష్కరించి ప్రజల్లో సంతృప్తిస్థాయి పెంచాలన్నారు.
శకటాలు సిద్ధం చేయండి..
రానున్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 10 సూత్రాల కార్యక్రమంపై శకటాలు రూపొందించేందుకు సంసిద్ధం కావాలన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా చేపట్టిన పీ4 కార్యక్రమానికి సంబంధించి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో బంగారు కుటుంబాలు – మార్గదర్శుల విజయగాధలను సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం పచ్చిరొట్ట ఎరువులను వాడటం ద్వారా 20 శాతం ఎరువులు ఆదా అవుతాయని పచ్చిరొట్ట ఎరువుతో మట్టికి జీవం వస్తుందని నేలసారం పెంపుతో పాటు సాగుకు ఖర్చులు తగ్గిస్తాయని తెలిపే వాల్ పోస్టర్లను డీఆర్వో ఆవిష్కరించారు.
నగదు ప్రోత్సాహకాలు..
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముగ్గురు అంతకు మించి పిల్లలు ఉన్న కుటుంబాల్లో లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసిన మూడు కుటుంబాలకు ఒక్కొక్కరికీ ప్రశంసాపత్రం, రూ.5వేల నగదు ప్రోత్సాహకాన్ని డీఆర్వో చేతుల మీదుగా అందజేశారు. అలాగే వ్యాసెక్టమీ ఆపరేషన్లకు అంగీకరించిన వారికి, ఉత్తమ గైనకాలజిస్ట్, ఉత్తమ వ్యాసెక్టమీ సర్జన్ వైద్యులైన డాక్టర్ సుచిత్ర, డాక్టర్ హరిరంగ ప్రసాద్‌లకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. మీకోసం కార్యక్రమంలో అధికారులు 125 అర్జీలను స్వీకరించారు.
డీఆర్వో చంద్రశేఖరరావు ‘మీ కోసం’లో 165 అర్జీలు స్వీకరణ
వచ్చిన అర్జీల్లో కొన్ని..
గత ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను ప్రస్తుతం నిలిపివేశారు. ఆపరేటర్లకు ఉన్న బ్యాంకు బకాయిలను జమ చేసి క్లియరెన్స్ సర్టిఫికెట్లు అందజేస్తామని ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రభుత్వం క్లియరెన్స్ సర్టిఫికెట్లు అందజేసి జీవనోపాధికి అవకాశం కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కృష్ణా జిల్లా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పిండి శ్యాంబాబు అర్జీ ఇచ్చారు.
మచిలీపట్నానికి చెందిన జల్దు కల్యాణ్‌బాబు కలెక్టర్‌కు అర్జీ ఇస్తూ నగరంలో నిర్మించిన పీవీఆర్ షాపింగ్ మాల్ భవన నిర్మాణంలో లోపాలు ఉన్నాయని తెలిపారు. భవన నిర్మాణం సమయంలో కొన్ని ప్రాంతాల్లో శ్లాబుల కూలిపోయిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే వరంమాల్‌లో వచ్చే ప్రజలకు పార్కింగ్ తదితర అంశాల్లో అధిక ఫీజులను వసూలు చేస్తున్నారని వీటిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని తక్షణమే చర్యలు చేపట్టాలని విన్నవించారు.