
జగజ్జననికి జేజేలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాల్లో భక్తులు జగజ్జననికి జేజేలు పలుకుతున్నారు. దుర్గమ్మకు సారె సమర్పణ కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం తరలివస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు 70 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వ దర్శనం క్యూలైన్‌లో అమ్మవారిని దర్శించుకునేందుకు మూడు గంటల సమయం పట్టగా, సామాన్య భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఉదయం నుంచే అంతరాలయ దర్శనం పూర్తిగా నిలిపివేశారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పణకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు ఆపేశారు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే అంతరాలయ దర్శనం కల్పించారు.
ఉత్సవమూర్తికి సారె సమర్పణ
తెలంగాణ నుంచి అమ్మవారికి సమర్పించే బంగారు బోనంను చూసేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలోనే వేచి ఉండటంతో మరింత రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. సారె ఇవ్వడానికి వచ్చిన భక్తులు తొలుత ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి సారెను సమర్పించారు. అనంతరం భక్తబృందంలోని సభ్యులకు సారెలోని పసుపు, కుంకుమతో పాటు ప్రసాదాలను పంపిణీ చేశారు. రద్దీ నియంత్రణకు దేవస్థానంలోని ఇంజినీరింగ్, పరిపాలనా విభాగం, ఇతర విభాగాల సిబ్బందికి అదనపు విధులను కేటాయించారు.
సూర్యోపాసన సేవ
దుర్గగుడిలో ఆదివారం సూర్యోపాసన సేవ చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్యభగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
దుర్గమ్మకు సారె, బోనాలు సమర్పణ
70 వేల మందికి పైగా భక్తులకు అమ్మ దర్శనం
అంతరాలయ దర్శనం రద్దు
సర్వ దర్శనానికి మూడు గంటలు

జగజ్జననికి జేజేలు

జగజ్జననికి జేజేలు