
కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
ఇఫ్టూ భవన నిర్మాణ కార్మిక సంఘాల విలీన సభ డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని ఇఫ్టూ రాష్ట్ర నాయకుడు కె. పోలారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఇఫ్టూ అనుబంధ.. ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం, ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం విలీన సభ జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో పోలారి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో హామీలను ఇచ్చారన్నారు. బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారానికి వచ్చి ఏడాది అయినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు అట్టడుగు స్థాయిలో ఉండడం బాధాకరమన్నారు.
నూతన కమిటీ ఎన్నిక..
ఇఫ్టూ ఉపాధ్యక్షుడు ఆర్.మోహన్ మాట్లాడుతూ రెండు సంఘాలను ఒకే సంఘంగా విలీనం చేశామని, ఇకపై ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం పేరుతో పనిచేస్తుందని ప్రకటించారు. ఈ మేరకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు. నూతన సంఘానికి అధ్యక్షుడిగా ఆర్.మోహన్, ప్రధాన కార్యదర్శిగా కె.వి రమణ, ఉపాధ్యక్షుడిగా ఏసురత్నం, సహాయ కార్యదర్శిగా ఎం. నాగరాజు, కోశాధికారిగా గుబ్బల ఆదినారాయణ, మరో 12 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.