పెద్ద ఎత్తున ఇసుక, మట్టి దోపిడీ  | - | Sakshi
Sakshi News home page

పెద్ద ఎత్తున ఇసుక, మట్టి దోపిడీ 

Jul 1 2025 7:23 AM | Updated on Jul 1 2025 3:52 PM

ఎక్కడ తవ్వకాలు జరిగినా కప్పం కట్టాల్సిందే

ఉద్యోగుల బదిలీల పేరిట వసూళ్లు 

బూడిద స్లిప్పులు తన కనుసన్నల్లోనే.. 

విజిలెన్స్‌, మైనింగ్‌ అధికారులను పావులుగా వాడుకుంటున్న వైనం 

కీలుబొమ్మగా మారిన విజయవాడ పార్లమెంట్‌ ముఖ్యనేత

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ‘కిశోర’ పర్వంగా ప్రారంభమైన అవినీతి, అక్రమాలు.. రోజురోజుకీ శౌర్య రూపం దాల్చుతున్నాయి. పార్లమెంట్‌ ముఖ్యనేత కార్యాలయంలోనే ఉంటూ ‘ఆయన’ తన హవా నడిపిస్తున్నారు. ఈయన చేతిలో పార్లమెంట్‌ ముఖ్యనేత కీలుబొమ్మగా మారారని టీడీపీ వర్గాలే బహిరంగంగా పేర్కొంటున్నాయి. ప్రతి పనికీ రేటు కట్టి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక, మట్టి, రేషన్‌ బియ్యం, పేకాట, బూడిద దేనిని వదలకుండా కోట్ల రూపాయలు దోచేస్తున్నట్లు చెబుతున్నారు. విజిలెన్స్‌, మైనింగ్‌, పోలీసు వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకొని దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పార్లమెంటు నేత కార్యాలయానికి వచ్చిన వారిని గంటల తరబడి నిలబెట్టడం, వారి పట్ల దురుసుగా వ్యవహరించటం పరిపాటిగా మారినట్లు చెబుతున్నారు.

విజిలెన్స్‌ అధికారులతో దాడులు..

ఎన్టీఆర్‌ జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌, కాంట్రాక్టర్‌లు, ట్రాన్స్‌పోర్టర్‌లు.. తనకు కప్పం చెల్లించకుండా గ్రావెల్‌, మట్టి ఎక్కడ తవ్వినా విజిలెన్స్‌ అధికారులకు ఫోన్‌ చేసి, వారితో దాడులు చేయించి వాహనాలు సీజ్‌ చేయిస్తున్నారని, బేరం కుదిరిన తరువాతే వాహనాలను రిలీజ్‌ చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ వ్యక్తి హైవే కాంట్రాక్టర్‌తో మట్టి తోలకం ఒప్పందం కుదుర్చుకొని తోలుతుంటే, విజిలెన్స్‌ అధికారులతో దాడులు చేయించి వాహనాలను సీజ్‌ చేయించినట్లు ఆరోపణలున్నాయి. రూ.20లక్షలు ముడుపులు ముట్టిన తర్వాతే ఆ వాహనాలను రిలీజ్‌ చేయించినట్లు పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో ఇబ్బందులు పడి డబుల్‌ పెనాల్టీ కట్టడం ఎందుకనే భావనతో, ఇతనితోనే ముందుగా ఒప్పందం చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి..

దోపిడీ పర్వం ఇలా..

●హైవే పనులకు గ్రావెల్‌ తోలుకుంటున్న కాంట్రాక్టర్‌ను బెదిరించి రెండు విడతలుగా రూ.కోటి వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

●తిరువూరులో రేషన్‌ మాఫియా నుంచి రూ.20 లక్షలు, మట్టి మాఫియా నుంచి రూ.20లక్షలు, పేకాట శిబిరాల నిర్వహణ నుంచి నెలకు రూ.10 లక్షలు మామూళ్లు వసూలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో తిరువూరు నియోజకవర్గ ముఖ్యనేతకు కొంత వాటా ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

●ఈ ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో తిరువూరు నియోజకవర్గంలో కోడి పందేలు, కోత ముక్క ఆట ఆడించినందుకు రూ.కోటిపైగా వసూలు చేసి, ‘కిశోరం’తో పాటు నియోజకవర్గ ముఖ్యనేత సగం సగం తీసుకున్నట్లు అప్పట్లో చర్చ నడిసింది.

●జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగ్రంచిపోలు, నందిగామ నియోజకవర్గంలోని గండేపల్లి తెలంగాణ నుంచి క్యాసినో బృందాలను తెచ్చి జూద శిబిరాలు నిర్వహించారు. ఇందుకోసం ఒక్కో దాని నుంచి రూ.40లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు బలంగా వినిపించాయి.

●ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీటీపీఎస్‌ బూడిదను హైవే పక్కనే డంప్‌ చేసి, ఇతనే ఒక్కో లారీ లోడింగ్‌ కోసం టోకెన్‌కు రూ.3,500 తీసుకొని ఇస్తున్నట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. రోజుకు పెద్ద సంఖ్యలో టోకెన్‌లు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలన్నీ ఆ పార్లమెంట్‌ ముఖ్యనేత కార్యాలయం కేంద్రంగానే సాగుతుండటం.. ఆ ముఖ్యనేత అస్సలు నోరు మెదపకపోవడంతో.. అంతా ఆయనకు తెలిసే జరుగుతోందా అన్న చర్చలు ఆ పార్టీ వర్గాల్లోనే నడుస్తోంది.

సీఐ పోస్టింగ్‌కు రూ.30లక్షలు..

జిల్లాలోని ఓ రూరల్‌ నియోజకవర్గం పరిధిలో సీఐ పోస్టింగ్‌కు రూ.30లక్షలు వసూలు చేసినట్లు బహిరంగానే చర్చించుకొంటున్నారు. ముడుపులు చెల్లించి పోస్టింగ్‌ తెచ్చుకోవడంతో ఆ సీఐ రెచ్చిపోతున్నారని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి. ఆ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పాత కేసులకు సంబంధించి దాదాపు 250–300 మంది ముద్దాయిలను స్టేషన్‌కు ిపిలిపించి.. వారి నుంచి రూ.20వేల నుంచి రూ.30వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నా యి. కొంత మంది వ్యభిచారులను స్టేషన్‌కు పిలిపించి, వారి ఫోన్‌లో ఉన్న కొంత మంది వ్యక్తులకు ఫోన్‌ చేసి, బెదిరించి, ముక్కుపిండి డబ్బులు వసూలు చేయడంతో, విషయం బయటకి చెప్పుకోలేక కొంత మంది టీడీపీ నేతలే లోలోన కుమిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సీఐ దందాలో అక్రమాల కిశోరానికి వాటా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆ సీఐ విజయవాడ నగరంలోని ప్రముఖ బంగారు దుకాణంలో రూ.50లక్షల బంగారం కొనుగోలు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement