
ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ చేయటం అదృష్టం
జిల్లా ఎస్పీ గంగాధరరావు
కోనేరుసెంటర్: పోలీసుశాఖలో సుదీర్ఘకాలం పా టు పనిచేసి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉద్యోగ విరమణ చేయడం అదృష్టంగా భావించాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందిని సోమవారం ఆయన తన కార్యాలయంలో కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా సన్మానించారు. సిబ్బంది అందించిన సేవలను పోలీసుశాఖ ఎన్నడూ మరువదన్నారు. ఎస్‌ఐలు పి.ప్రసాద్‌రాజు (సీసీఎస్, మచిలీపట్నం), ఎండీ మస్తాన్‌ఖాన్ (మహిళా పీఎస్, మచిలీపట్నం), ఏఎస్‌ఐ వై.సత్యనారాయణ (డీటీఆర్‌బీ), టి.బెనర్జీబాబు (హెచ్‌సీ, బందరు ట్రాఫిక్), కె.శ్రీనివాసరావు (హెచ్‌సీ, పీసీఆర్), టి.ఆనందరావు (హెచ్‌సీ, ఏఆర్), బి.సుబ్బయ్య (హెచ్‌సీ, ఏఆర్) ఉద్యోగ విరమణ పొందిన వారిలో ఉన్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, పలువురు డీఎస్పీలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
యలమర్రు(పెదపారుపూడి): విద్యు త్ మోటారు నుంచి వచ్చిన విద్యుత్ సరఫరా కారణంగా ఓ వలస కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని యలమర్రులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కలుపుకూరి సూరి(18) పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం ముండ్రువారిపాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలుడు. సూరి తన తల్లి పాకీరమ్మతో కలిసి రెండు రోజుల క్రితం యలమర్రు గ్రామంలోని మూల్పూరి నరేంద్ర అనే రైతు పొలంలో పనులకు వచ్చారు. సోమవారం ఉదయం పొలంలో గట్లు పని చేస్తుండగా పక్కనే విద్యుత్ మోటారు నుంచి విద్యుత్ సరఫరా కావటంతో షాక్ తగిలి అక్కడికక్కడే పడి పోయాడు. తోటి కూలీలు స్థానిక పీహెచ్‌సీకి తరలించగా పరీక్షలు చేసిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించామని ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
డివైడర్‌ను ఢీకొని ఇరువురు యువకులు దుర్మరణం
కోనేరుసెంటర్: రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు మృతి చెందారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసుల విచారణలో తేలింది. జరిగిన సంఘటనపై ఇనకుదురుపేట పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బందరు మండలం చిన్నాపురం గ్రామానికి చెందిన దాలిపర్తి పవన్‌కళ్యాణ్ (23), కోడూరు గ్రామానికి చెందిన మేడా రవీంద్ర (22) మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో క్లీనర్‌లుగా పనిచేస్తున్నారు. సోమవారం చిన్నాపురం గ్రామంలోని మద్యం దుకాణంలో వారిద్దరూ పూటుగా మద్యం తాగి బైక్‌పై మితిమీరిన వేగంతో మచిలీపట్నం వస్తుండగా శారదానగర్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇరువురి తలలు పగిలిపోయి మెదళ్లు బయటికి వచ్చి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు ఇనకుదురుపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఇరువురి కుటుంబాలకు అందజేసినట్లు సీఐ పరమేశ్వరరావు తెలిపారు.
పొట్టకూటి కోసం వెళ్లి అనంతలోకాలకు..!
కోడూరు: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన మేడ రవీంద్ర(25) తల్లిదండ్రులు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో రవీంద్ర మచిలీపట్నంలోని బంధువుల ఇంటి వద్ద ఉంటూ ఓ ప్రయివేటు ట్రావెల్స్‌లో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం స్నేహితుడితో కలిసి మచిలీపట్నం వెళ్తుండగా శారదనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. రవీంద్ర మృతితో రామకృష్ణాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి బయలుదేరారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గొల్లపూడిలోని గోదావరి రుచులు హోటల్ సమీపంలో జరిగింది. ఆదివారం అర్థరాత్రి సమయంలో ఓ వ్యక్తి విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే రోడ్డులో గొల్లపూడి గోదావరి రుచులు హోటల్‌కు ఎదురుగా నడుచుకుంటూ వెళుతున్నాడు. వెనుక నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ఆ వ్యక్తిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో మృతుని తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు.

ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ చేయటం అదృష్టం

ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ చేయటం అదృష్టం

ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ చేయటం అదృష్టం