
రుణాలను సద్వినియోగం చేసుకోండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి తదితరాల ద్వారా పొందిన రుణాలను తప్పనిసరిగా జీవనోపాధి కార్యకలాపాలకు ఉపయోగించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. సంపద సృష్టికి రుణాలు వాడుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన వార్షిక రుణ–జీవనోపాధి ప్రణాళిక నుంచి సూక్ష్మ రుణ ప్రణాళిక – జీవనోపాధులపై సమావేశం జరిగింది. స్వయం సహాయక సంఘాల మహిళలు పొందే రుణాలపై పర్యవేక్షణ చేసి.. ఆ రుణాలను కుటుంబాల ఆర్థిక సాధికారతకు ఉపయోగపడేలా చేయిపట్టి నడిపించాలని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
రూ.1,266 కోట్లతో కార్యాచరణ..
జిల్లాలో 16 మండల సమాఖ్యలు, 767 గ్రామ సమాఖ్యలు, 24,880 స్వయం సహాయక సంఘాలు, 2,47,611మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. 2024–25లో 1,93,691మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ. 1,147.59 కోట్ల మేర రుణ మద్దతు లభించిందన్నారు. 2025–26కు సంబంధించి స్వయం సహాయక సంఘాల సభ్యుల వ్యక్తిగత జీవనోపాధి అవసరాలు ఆధారంగా దాదాపు రూ.1,266 కోట్ల వార్షిక రుణ–జీవనోపాధి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు వివరించారు. కుటుంబ స్థాయి సర్వే ఆధారంగా ఈ వార్షిక రుణ ప్రణాళికకు రూపకల్పన చేసినట్లు తెలిపారు.
సెప్టెంబర్ 30 వరకు ప్రచారం..
ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎల్‌డీఎం కె.ప్రియాంక వివరించారు. బ్యాంక్ లింకేజీపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, యూఎల్‌బీల్లో కనీసం ఒక శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ